Flood to Irrigation projects: రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి ఉస్మాన్ సాగర్ జలాశయానికి 1600 క్యూసెక్కులు నీరు వస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి మూసిలోకి 788క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1787 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ జలాశయానికి 300క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. జలాశయం గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1760.70 అడుగులుగా ఉంది.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 82,740 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 82,452 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 75.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1087 అడుగులకు చేరింది.
కరీంనగర్ దిగువమానేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మోయతుమ్మెద వాగు నుంచి వచ్చే వరద 15వేల క్యూసెక్కులకు తగ్గిపోగా.. మద్యమానేరు నుంచి 5వేల క్యూసెక్కులే ప్రాజెక్టులోకి వస్తోంది. మెుత్తం 23,284 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గోదావరిలోకి 45వేల క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో 15,993 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 13,493 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి వరద ప్రవాహం పెరిగింది.
ఇవీ చదవండి: కేటీఆర్‌కు నెటిజన్లు సూచించిన ఓటీటీ సినిమాలివే.. మీరు ఓ లుక్కేయండి..!
ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 50మీటర్ల దూరంలో శరీరభాగాలు!