flexies against modi in Hyderabad : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధాని రేపు పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
నవంబర్ 11న కర్ణాటక, తమిళనాడులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ.. అదే రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఏపీలో ఆరోజు రాత్రి రోడో షో నిర్వహించనున్నారు. మరుసటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం తెలంగాణ చేరుకుంటారు. అయితే మోదీ పర్యటనను ఇప్పటికే తెరాస, వామపక్ష పార్టీలు, పలు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని పర్యటనపై కార్మిక లోకం భగ్గుమంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 'మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ' (తెలంగాణలో మోదీకి ప్రవేశం లేదు) అంటూ జూబ్లీహిల్స్ చౌరస్తాలో ఫ్లెక్సీలు వెలిశాయి.
రామగుండంలో రూ.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఏడాదికి వేపపూతతో కూడిన యూరియాను ఉత్పత్తి చేస్తోంది. రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అలాగే రూ.2,200 కోట్లతో చేపట్టనున్న మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి (జాతీయ రహదారి-765డీజీ), బోధన్-బాసర-భైంసా (ఎన్‌హెచ్-161బీబీ), సిరొంచా-మహదేవ్‌పూర్ (ఎన్‌హెచ్-353సీ) మార్గాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.