Five Bills Passed in Telangana Assembly : ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ ఐదు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- టిమ్స్ బిల్లుతో పాటు కర్మాగారాలు, మైనార్టీ కమిషన్, జీఎస్టీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. నాలుగు టిమ్స్ ఆసుపత్రుల నిర్వహణా విధానానికి సంబంధించిన బిల్లు గురించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు. కర్మాగారాల్లో నిర్ధిష్ట నిబంధనలకు లోబడి మహిళలు ఎక్కువ సమయం పనిచేసేలా కర్మాగారాల చట్టసవరణ బిల్లును తీసుకొచ్చారు.
జైన ప్రతినిధికి కూడా మైనార్టీ కమిషన్‌లో చోటు కల్పించేలా చట్టసవరణ, కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా జీఎస్టీ చట్టసవరణ బిల్లులను తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా వందపైగా గ్రామ పంచాయతీల ఏర్పాటు.. వాటి పేర్లు, సరిహద్దుల మార్పు కోసం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును తీసుకురాగా.. వీటిని శాసనసభ ఆమోదించింది. ఇవాళ విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలతో దద్దరిల్లిన అసెంబ్లీ.. సాయంత్రం 6.30 గంటల వరకు సజావుగా సాగింది. అనంతరం సభ ఆదివారానికి వాయిదా పడింది.
Telangana Assembly Monsoon Sessions 2023 : గతంలో గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మరోసారి శాసనమండలి ఆమోదించింది. బిల్లులను మండలిలో... మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు-2022, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు-2022ను.. మంత్రి హరీశ్‌రావు మండలి ముందుకు తీసుకువచ్చారు. ప్రైవేట్ వర్సిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్.. రెగ్యులేషన్ సవరణ బిల్లు-2022ను.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు-2023ను మండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. ఈ నాలుగు బిల్లుల శాసనమండలి ఆమోదించిన అనంతరం... మండలి రేపటికి వాయిదా పడింది.
పెండింగ్‌లోనే ఆర్టీసీ బిల్లు..: మరోవైపు ఆర్టీసీ బిల్లుకు సంబందించి ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. కేబినేట్ ఆమోదించిన బిల్లును గవర్నర్ వద్దకు పంపించగా.. ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. బిల్లుకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం బిల్లుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చారు. దీనిపై మరోమారు గవర్నర్ స్పందిస్తూ.. ఆర్టీసీ విలీనం ఉద్యోగులు ఎప్పట్నుంచే కోరుతున్న భావోద్వేగ అంశమని గవర్నర్ అన్నారు. ఉద్యోగుల చిరకాలవాంఛ నెరవేరడంలో రాజ్‌భవన్ అడ్డుపడదని స్పష్టం చేశారు. ఇంత వరకు బిల్లుకు సంబంధించి స్పష్టత రాకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. ఒక వేళ గవర్నర్ బిల్లు ఆమోదిస్తే.. ఆదివారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.