చేపపిల్లల కొనుగోలు ధరలపై యంత్రాంగంలో అనుమానాలు రేగుతున్నాయి. తక్కువ ధర కోట్ చేసి టెండర్లు దక్కించుకోవటం ఇందుకు నేపథ్యమవుతోంది. ముందస్తు జాగ్రత్తగా గుత్తేదారులు నిబంధనల ప్రకారం చేపపిల్లలు(సీడ్) పంపిణీ చేసేలా వారి నుంచి మత్స్యశాఖ అదనంగా డిపాజిట్లను వసూలు చేస్తోంది. కొందరు గుత్తేదారులు ఏకంగా 26 శాతం తక్కువ కోట్ చేసి టెండర్లు చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గుత్తేదారులు సరిగా పంపిణీ చేయకపోతే జరిమానా వేసేందుకు కట్టాల్సిన డిపాజిట్‌ను మరో 5 శాతం పెంచింది.
నీటివనరుల్లో చేపపిల్లలను ఈ నెల 5 నుంచి వదిలేందుకు భారీ కార్యక్రమానికి మత్స్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 81 కోట్ల చేపపిల్లలకు రూ.55 కోట్లు, మరో 5 కోట్ల రొయ్యపిల్లలకు రూ.10 కోట్లు కేటాయించింది. రెండు రకాల పరిమాణం(సైజు)లో ఉండే చేపపిల్లలను కొంటోంది. వర్షాకాలంలో మాత్రమే నీరుండే చెరువుల్లో వదిలే చేపపిల్లల సైజు 35 నుంచి 40 మిల్లీమీటర్లు(మి.మీ.) ఉండాలి. పెద్ద జలాశయాల్లో 80 నుంచి 100 మి.మీ.లున్న వాటినే వదలాలి.
ఉత్పత్తి వ్యయానికి మరీ దూరంగా...
చేపపిల్లల ఉత్పత్తి వ్యయంపై మత్స్యశాఖ క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా లెక్కలు తయారుచేసింది. దీని ప్రకారం లక్ష చిన్నసైజు చేపపిల్లల ఉత్పత్తి వ్యయం రూ. 55వేలు అవుతుంది. అంటే పిల్ల ధర సగటున 55 పైసలు. ఈ ధరకు 10 శాతం ఎక్కువ/తక్కువకే టెండర్ వేయాలంది. కొందరు వ్యాపారులు ఒక్కో పిల్లను 46 పైసలకే ఇస్తామన్నారు. ఇలాగే పెద్ద చేపపిల్ల ఉత్పత్తికి కనిష్ఠంగా రూ.108 పైసల వరకూ ఖర్చవుతుంది. వీటి కనీస ధర ఒక్కింటికి 121 పైసలుగా నిర్ణయించగా.. కొందరు వ్యాపారులు 90 పైసలకే ఇస్తామన్నారు.
తనిఖీలు లేకుంటే కాకిలెక్కలే గతి
గతేడాది(2019-20)లో మొత్తం 75 కోట్ల పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకోగా చివరికి 61 కోట్ల పిల్లలు వదిలారు. ఈ ఏడాది లక్ష్యం 81 కోట్ల చేపపిల్లలు. వీటి కొనుగోలుకు జిల్లా కమిటీలే వేర్వేరుగా టెండర్లు పిలిచాయి. ఓ వ్యాపారి సరైన దరఖాస్తుల్లేకుండా 8 జిల్లాలకు టెండర్లు వేయగా కమిటీలు తిరస్కరించాయి. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లగా పరిశీలించమని ఉత్తర్వులిచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు వ్యాపారులు టెండర్లు వేయగా నిబంధనల ప్రకారం లేవని మూడింటిని తిరస్కరించారు. చేపపిల్లలను వదిలే సమయంలో సరైన తనిఖీల్లేకపోతే గుత్తేదారులు తూతూ మంత్రంగా పనికానిచ్చే ప్రమాదముందని మత్స్య సహకార సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.