Fire Crackers: గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు దీపావళి పండగను పెద్దగా జరుపుకోలేదు. ఈ సంవత్సరమైన ఘనంగా జరుపుకోవాలి అనుకునే ప్రజలకు బాణసంచా ధరలు.. పంటి కింద రాయిలాగా మారాయి. దీపావళి పండగ అంటే బాణసంచా సాధారణం. గత రెండు సంవత్సరాలుగా పండగ లేకపోవటంతో టపాకాయల క్రయవిక్రయాలు జరగలేదు. ఈ సంవత్సరమైనా వ్యాపారం బాగుటుందని ఆశించిన వ్యాపారులకు.. నిరాశే ఎదురైంది. ఏపీలోని గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. సరదాగా జరుపుకుందామనుకున్న పండుగ వేళ టపాకాయల ధరలు కొండెక్కడంతో.. బాణసంచా కొనలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు వచ్చిన ప్రజలు.. పెరిగిన ధరలను చూసి హడలెత్తుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పండగను జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం జరుపుకుందామనుకుంటే ధరలు వీపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగటం వల్ల బాణసంచా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వం బాణాసంచా ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోకపోవటం వలనే.. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు.
అనంతపురంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా బాణసంచా స్టాల్స్ ఏర్పాటు చేశారు. బాణసంచా కొనుగోలుకు వచ్చిన ప్రజలు ధరలను చూసి ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో కంటే ధరలు అధికంగా పెరిగాయని.. ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపుతోందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాల్లో సుమారు వెయ్యికి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కావలి, కందుకూరు, ఆత్మకూరు పట్టణాల్లో ప్రత్యేకంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. క్రయ విక్రయాలు ధరలు పెరిగిన కూడా జోరందుకున్నాయి. ధరలు పెరిగిన కూడా కొనుగోలుదారులు ఆ భారాన్ని భరించుకుని బాణసంచా కొనుగొలు చేస్తున్నారు. దీపావళి పండగ అంటేనే బాణసంచా ప్రత్యేకమని.. అందుకు తప్పటం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా పోలీసుల ప్రత్యేక భద్రత నడుమ బాణసంచా స్టాల్స్‌ను నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: