ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. రెండేళ్లలో రూ. 4,000 కోట్లతో సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించడం సహా ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానించనున్నారు. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఈ నిధులతో..
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నోడల్ ఏజెన్సీగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. బడ్జెట్ నిధులతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం, సమగ్ర శిక్షా అభియాన్, నాబార్డు నిధులను ఇందుకోసం ఉపయోగించనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీ గోడలు నిర్మించే వెసులుబాటు ఉంది. దీంతో ఈ ఏడాది 350 కోట్ల రూపాయల ఉపాధిహామీ నిధులను ఇందుకోసం వినియోగించనున్నారు. అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేటాయించిన రూ.5 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రెండు కోట్లను పాఠశాలలకు కేటాయించాలన్న ఆలోచన కూడా ఉంది.
15వ ఆర్థిక సంఘం నిధులనూ.. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఉపయోగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అన్ని నిధులతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సర్కార్ సిద్ధమైంది.
15 రోజుల్లో..
తరగతి గదులు, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, ఫర్నీచర్, పెయింటింగ్, వంట గదులు విధిగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. విద్యార్థులకు డిజిటల్ పరిజ్ఞానం అందేలా కంప్యూటర్ సౌకర్యాన్ని కల్పిస్తూ డిజిటల్ తరగతులను అభివృద్ధి చేస్తారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆయా పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు, అవసరాలను రానున్న పక్షం రోజుల్లో గుర్తించనున్నారు. వాటి ఆధారంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన పనులు చేపడతారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
విధిగా నెలవారీ నిధులు!
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఇస్తున్నట్లే విధిగా నెలవారీ నిధులను పాఠశాలల అభివృద్ధికి కూడా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కార్యాచరణపై ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఉపసంఘం... త్వరలో మరోమారు భేటీ కానుంది. కార్యక్రమ అమలు ప్రణాళికను ఖరారు చేస్తారు. అటు పూర్వ విద్యార్థులనూ భాగస్వామ్యుల్ని చేయాలన్న ప్రతిపాదన ఉంది. పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి వారి నుంచి విరాళాలు తీసుకోవాలని భావిస్తున్నారు.