అనుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఈ పథకం ద్వారా దేశంలో ఐదెకరాల్లోపు ఉన్న అన్నదాతలకు ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 2018 డిసెంబర్ నుంచే పథకం అమల్లోకి వచ్చిందని... రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయనున్నట్లు గోయల్ తెలిపారు. మొదటి విడతగా రెండు వేల రూపాయలు త్వరలోనే రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి.
ఈ పథకంతో రాష్ట్రంలో 51 లక్షల రైతులకు లబ్ధి చేకురుతుంది. వీరిలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్నవారు 40 లక్షలకు పైగా ఉండగా ఐదెకరాల్లోపు ఉన్నవారు 11 లక్షలకు పైగా ఉన్నారు. వీరికి త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం ఇచ్చే పెట్టుబడి సాయంతో రూ.6 వేలు కలిపి ఇస్తారా లేక విడిగా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.