Film Producer Anjireddy Murder Case Update : ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం ఆయన ఆస్తికొట్టేసేందుకే రాజేశ్ అనే వ్యక్తి హత్య చేశారని పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో మరికొందరు కూడా భాగమైనట్లు అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు అంజిరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.
సీహెచ్ అంజిరెడ్డి 1990 సంవత్సరంలో పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు. సినీ పరిశ్రమలో వివాద రహితుడిగా ఆయన పేరు సంపాదించారు. అనంతరం సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి వ్యాపారం చేశారు. ఆయన ముగ్గురు పిల్లలు స్థిరపడటంతో.. తన భార్యతో అంజిరెడ్డి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ కావాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విదేశాలకు వెళ్లే లోపుగానే సైదాబాద్, పద్మారావునగర్‌లోని తన ఆస్తులను విక్రయించాలని అంజిరెడ్డి అనుకున్నారు.
ఇదే విషయాన్ని అంజిరెడ్డి తనకు పరిచయం ఉన్న రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు చెప్పారు. సైదాబాద్‌లోని ఇంటి విక్రయంలో ఇబ్బందులు ఎదురవటంతో ఒత్తిడికి గురయ్యారు. పద్మారావునగర్‌లో ఎంతో ఇష్టంగా నిర్మించిన ఇంటిని ఎలాగైనా విక్రయించాలనుకున్నారు. గత నెల రెండో వారంలో సినీ ఫొటోగ్రాఫర్ రవి ద్వారా జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేశ్ (Rajesh) పరిచయమయ్యాడు. పద్మారావునగర్‌లోని ఇంటిని తానే కొంటానంటూ అతను ముందుకొచ్చాడు.
Anjireddy Murder Case Latest Update : రూ.4 కోట్ల విలువైన ఇంటిని వీలైనంత తక్కువకు దక్కించుకోవాలని రాజేశ్ పథకం వేశాడు. దాన్ని అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళికను వేసుకున్నాడు. పరిచయమైన నాటి నుంచి అంజిరెడ్డి ఇంటికి ప్రతిరోజూ రాజేశ్ వెళ్లేవాడు. ఇంటి కొనుగోలుకు అవసరమైన డబ్బంతా సిద్ధంగా ఉందంటూ మాట్లాడేవాడు. ఒక రోజు రూ.50లక్షలు, మరుసటి రోజు కోటి ఇవ్వబోతున్నట్టు మృతుడి భార్యకు వినిపించేంత పెద్దగా చెబుతుండేవాడు.
Producer Anji Reddy Murder Case : తన పథకం సఫలమైతే తాను డబ్బులిచ్చినట్టు అంజిరెడ్డి భార్య ద్వారానే సాక్ష్యం చెప్పించాలనే ఆలోచనతో.. రాజేశ్ ఇదంతా చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు వెల్లడించినట్టు తెలుస్తోంది. తనపై పూర్తి నమ్మకం కుదిరినట్టు నిర్ధారించుకున్నాక.. అంజిరెడ్డిని హత్య చేయాలని అతను భావించాడు. గత నెల 29న మధ్యాహ్నం అంజిరెడ్డికి ఫోన్ చేసిన రాజేశ్.. సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని జీఆర్ కన్వెన్షన్ హాలుకు రావాలని కోరాడు.
అప్పటికే సిద్ధంగా ఉన్న ఒప్పంద పత్రాలపై అంజిరెడ్డిని సంతకం చేయాలంటూ.. రాజేశ్ బలవంతం చేశాడు. ఆ పత్రాల్లో తనకు రూ.2.5కోట్లు చెల్లించినట్టు ఉండటంతో ఆయన ఎదురుతిరిగాడు. విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించాడు. తిరిగి బయటకు వచ్చేందుకు లిఫ్ట్‌వద్దకు చేరిన అంజిరెడ్డిపై.. రాజేశ్, బిహార్‌కు చెందిన సత్యేంద్ర పవన్, జయమంగళ్‌కుమార్, వివేక్‌కుమార్, రాజేశ్‌కుమార్, హయత్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్ ప్రభుకుమార్ మూకుమ్మడిగా దాడి చేశారు.
Film Producer NRI Anji Reddy Murder Case : ఈ క్రమంలో అంజిరెడ్డి కేకలు వేసేందుకు ప్రయత్నించటంతో నిందితులు.. ఆయన ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కారు డ్రైవింగ్ సీట్లో మృతదేహాన్ని ఉంచి వెనుక నుంచి నెట్టి పిల్లర్‌ను ఢీ కొట్టేలా చేసి నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. గోపాలపురం పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారిని కస్టడీకి తీసుకొని మరికొంత సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు రాజేశ్‌పై గతంలోనూ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఒక యువతి ఆత్మహత్యకు కారణమైనట్టు కేసు నమోదైంది.
మహబూబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్యకేసులో నిందితుడికి మరణశిక్ష