రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్నవిబేధాలు తొలిగిపోలేదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి వివాదం రాజుకుంటోంది. ఆ స్థానంలో అభ్యర్థిత్వంపై పార్టీలో నేతల మధ్య విభేధాలు నెలకొన్నాయి. హుజూర్‌నగర్ స్థానానికి అభ్యర్థి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్రెడ్డిపైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌కుమర్ రాజీనామాతో హుజూర్‌నగర్ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారని ఉత్తమ్ ఇటీవల ప్రకటించారు. దీనిపై తాజాగా స్పందించిన రేవంత్ రెడ్డి.. పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ స్థానిక నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదిస్తానని తెలిపారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కుంతియాను కలిసి రేవంత్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వివరణ కోరాలని అడిగినట్లు సమాచారం.
యురేనియంపై ఏబీసీడీలు కూడా రావు:
బుధవారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తులో అవినీతి జరిగిందని తాను లేవనెత్తగా... అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ లేరన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు సీఎల్పీ సభ్యుడినైన తనకు సమాచారం అందలేదన్నారు. యురేనియంపై సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు కూడా రావని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి అతను కూడా హాజరయ్యారని.. పవన్‌కళ్యాణ్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం రాకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎప్పుడొస్తాయో... ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆధారాలను త్వరలోనే భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందచేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 14 రోజులు జరగాలన్నారు.
ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్