Clashes Between Telangana BJP Leaders : క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో భిన్న సంస్కృతి కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీలో పదవుల వేటలో కొందరు నేతలు అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తున్నారని నెల రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం.. నేతల మధ్య విభేదాలకు దారితీసింది. పదవుల విషయంలో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని విస్మరిస్తుండటంతోనే.. కొత్త నేతలు బీజేపీలో చేరడానికి వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి.
Internal Disputes Between Telangana BJP Leaders : అదే సమయంలో రాష్ట్ర బీజేపీకి తొలిసారిగా ప్రచార కమిటీని నియమిస్తారని, దాని బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగిస్తారనే మరో ప్రచారం మొదలైంది. అయితే... మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతల చేరికలపై ఈటల రాజేందర్ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన అంశాలు తీవ్ర కలకలం రేపాయి. వెంటనే పార్టీ ముఖ్య నేతలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, విఠల్, రవీందర్‌నాయక్, విజయరామారావు తదితరులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు క్షేత్రస్థాయిలోని బాధ్యులు, కార్యకర్తల్లో గందరగోళానికి గురిచేస్తున్నాయని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారనేది దుష్ప్రచారమని, ప్రచార కమిటీ లేదని జితేందర్‌రెడ్డి అప్పుడు స్పష్టం చేశారు.
"మీరేవైతే బీజేపీపై కామెంట్లు చేస్తున్నారో అవన్నీ సరైనవి కాదు. రాష్ట్రంలో కమ్ముకున్న మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా వెళ్లిపోతాయి. సూర్యుడు వస్తాడు కమలం వికసిస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి తయారుగా ఉన్నారు. బీజేపీలో అందరూ కలిసి పనిచేసే వారుంటారు. పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన వారందరినీ మేము ఆహ్వానిస్తాం." -జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ
తరచూ దిల్లీ టూర్లు..: ఒకవైపు బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడి మార్పులేదంటూ స్పష్టం చేస్తుండగా.. రాష్ట్రంలో దీనికి భిన్న పరిణామాలు జరుగుతుండటంతో శ్రేణులు తీవ్ర గందరగోళంలో పడుతున్నారు. వివిధ పరిణామాల నేపథ్యంలో నెల రోజుల నుంచి రాష్ట్ర నేతలు దిల్లీకి తరచూ వెళుతున్నారు. అగ్రనేతలతో సమావేశమవుతున్నారు. తొలుత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఇతర నేతలు దిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అందులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో మరోసారి బండి సంజయ్ మార్పుపై చర్చ జరిగింది. వెంటనే దిల్లీలో ఆయన బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. దీనిపై జితేందర్‌రెడ్డి ట్విటర్‌లో చేసిన పోస్టు, జత చేసిన వీడియో క్లిప్పులు కలకలం రేపాయి. ఇవి చర్చనీయాంశం కావడంతో తనది బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నమని తెలిపారు.
బండి సంజయ్ కళ్లు నెత్తికెక్కాయ్..: తాజాగా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయత్వంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌లపై దిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్ర నేతల్ని విస్మయానికి గురిచేసినట్లు తెలిసింది. బండి సంజయ్ కళ్లు నెత్తికెక్కి అహంకారం ఎక్కువైందని... ఆయన ఎవరినీ కలుపుకొని పోరన్నారు. దుబ్బాకలో తన గెలుపులో పార్టీ పువ్వు గుర్తు చివరి అంశమని... మునుగోడులో రూ.100 కోట్లు పంచినా పార్టీ ఓడిందని రఘునందన్‌రావు తెలిపారు.
ఇలాంటి పరిణామాలు కొత్త..: తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ తర్వాత ప్రకటించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పరిణామాలను కొత్తగా చూస్తున్నామని.. బీజేపీ విధానాలకు పూర్తి భిన్నమైన రీతిలో రాష్ట్ర నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పోకడలకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని.. లేదంటే పార్టీ మరింత నష్టపోతుందని తెలిపారు.
ఇవీ చదవండి: