భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సుపరిపాలనా వేదిక(FGG) కార్యదర్శి పద్మనాభ రెడ్డి డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వాలని... గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు. రెండు ప్లాంట్లకు కలిపి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని... సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం జెన్‌కో(GENCO) ఉపయోగించిన సాంకేతికత విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పిందని అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతరు చేయడంతో ఇద్దరు ఇంజినీర్లపైనా కేసులు నమోదయ్యాయని పద్మనాభరెడ్డి తెలిపారు. 1080 మెగావాట్ల సామర్థ్యంతో రూ.7290కోట్లతో 2015లో భద్రాద్రి థర్మల్ ప్లాంటు పనులు ప్రారంభించినా.... 2021లో పూర్తయ్యాయని.. ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.
బొగ్గును రైలు మార్గాన రవాణా చేస్తామని చెప్పిన జెన్‌కో అధికారులు... ఇప్పడు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. దీనివల్ల 10 గ్రామాల గిరిజనులు దుమ్ము, దూళితో అనారోగ్యం పాలవుతున్నారని పద్మనాభ రెడ్డి తెలిపారు.
యాదాద్రి థర్మల్ ప్లాంటును రూ.29,700కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారని, ఇది పూర్తి కావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేక ఏటా రూ.32వేల కోట్లు చెల్లించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పద్మనాభ రెడ్డి వెల్లడించారు. జెన్‌కో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఆ సంస్థ నష్టాల్లో ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజల పట్టం'