హైదరాబాద్ నగర నెహ్రూజూపార్కులోని ఆడ చింపాంజీ సుజీ గురువారం గుండెపోటుతో కన్నుమూసింది. 34 ఏళ్ల సుజీ బుధవారం వరకు ఆరోగ్యంగానే ఉంది. గురువారం ఉదయం 8.30కు జూ యానిమల్ కీపర్లు ఎన్‌క్లోజరు వద్దకు వచ్చి చూసేసరికి నిద్రలోనే కన్నుమూసి కన్పించింది. గుండెపోటుతో కన్నుమూసినట్లు వైద్యబృందం నిర్ధారించిందని క్యూరేటరు క్షితిజ పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం..
2011లో పుణెకు చెందిన సహారా గ్రూపు అధినేత సుబ్రతోరాయ్ నెహ్రూ జూకు 25 ఏళ్ల ఆడ చింపాంజీ సుజీని బహుకరించారు. జూలోని మగ చింపాంజీలు జిమ్మి, మధులకు తోడుగా ఉంటుందని, సంతానోత్పత్తి జరుగుతుందని అధికారులు భావించారు. 2012లో మగ చింపాంజీలు తనువు చాలించాయి. ఆ తర్వాత సుజీకి తోడు తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. జులై 15న సుజీ పుట్టిన రోజు వేడుకలను సిబ్బంది నిర్వహించారు. ఆ రోజు అది చేసిన సందడిని గుర్తుచేసుకున్నారు. సుజీ తన గదిలోని దుప్పట్లు చక్కగా పరుచుకునేదన్నారు.
ఇదీ చూడండి : 'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు