February 17th Unemployment Day: తెలంగాణలో ఫిబ్రవరి 17ను ఇక నుంచి నిరుద్యోగం దినంగా జరుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో లక్షా 90వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. గోల్కొండ పీఎస్ నుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడారు. సగ జీవితం పూర్తయినా... ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల మనోవేదనకు గురై నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు.
నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో మా హక్కు. విద్యార్థుల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మేం కొట్లాడుతున్నం. బరాబర్.. ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినోత్సవంగా జరుపుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ఖాళీలున్నాయి. నీ ఇంట్లో అందరికి ఉద్యోగాలొస్తే బంగారు తెలంగాణ అయినట్టా? లక్షలాది మంది తల్లిదండ్రుల కడుపుకోత నీకు అర్థమైతలేదా?
-- రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినంగా జరపాలని చూస్తే... తెరాస విద్యార్థి విభాగం దౌర్జన్యాలకు పాల్పడ్డారని రేవంత్ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను బానిసలుగా మార్చిందని మండిపడ్డారు. డీజీపీ మహేందర్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ రాజ్యం వస్తే.. ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినంగా జరుపుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం వారి కుటుంబం మాత్రమే బాగుపడిందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగ కుటుంబాలను పరామర్శిస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
6 గంటలకు ఇంటికి...
అనంతరం ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంట్లో వదిలిపెట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ఆ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునివ్వడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ఇచ్చి మూడు రోజులు కాకుంటే ముప్పై రోజులు పుట్టిన రోజులు చేసుకున్నా... తమకు అభ్యంతరం లేదని నిన్ననే ప్రకటించారు. అలా కాకుండా జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లయితే గాడిదలకు జన్మదిన వేడుకలు చేయాలని యువజన కాంగ్రెస్ పార్టీ విభాగాన్ని ఆదేశించారు.
ఏడు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లోనే...
రేవంత్ నిర్ణయంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఉదయం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పారు. చివరకు గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు రేవంత్ రెడ్డిని పోలీసులు తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బయటకి విడుదల చేసి మీడియాతో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డికి పోలీసులు అనుమతించారు. మీడియా సమావేశం ముగియగానే రేవంత్ రెడ్డిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి పోలీసు వాహనంలో జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద సాయంత్రం 6 గంటలకు దింపారు. దాదాపు ఏడుగంటలపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసు స్టేసన్‌లో ఉండడం విశేషం.
ఇదీ చూడండి: Raghunandan Rao on Cm Kcr: 'కటౌట్లు పెట్టినంత మాత్రానా దేశ్‌కీ నేత కాలేరు'