తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బాగోగులను చూసుకునేందుకు వచ్చిన ఆయన భార్య, మరదలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. పలు దవాఖానాల్లో రాత్రి సమయంలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి విధుల్లో ఉన్న ఆర్‌ఎంవోలు తమ గదులకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ఆసుపత్రి అంతా కలియ తిరిగి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాల్సి ఉన్నా సరే... నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగి, హోంగార్డు కలిసి మహిళపై అత్యాచారం చేయడం సంచలనం రేపింది. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం.. తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడంతో తరచూ ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి.
- గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు రోగులు భారీగా వస్తుంటారు. బయట గదులు అద్దెకు తీసుకొని ఉండే స్తోమత లేక ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉంటారు. కొందరు ఆరుబయటే నిద్రపోతుంటారు. వారి విలువైన వస్తువులు, చరవాణులు చోరీ అవుతున్నాయి.
- సీసీ కెమెరాల నిర్వహణకు ఏటా రూ.10-12 లక్షల వరకు ఖర్చవుతోంది. కెమెరాలు పెట్టడం తప్ఫ..పనిచేస్తున్నాయో...లేదో పర్యవేక్షణ లేదు.
ఇవీ వైఫల్యాలు...
- ఉస్మానియా ఆసుపత్రిలో రాత్రుళ్లు పర్యవేక్షణ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. రోగుల సహాయకులు మద్యం సీసాలతో పట్టుపడుతున్నారు. కొందరు లోపలకు తీసుకెళ్లి మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.
- ప్రస్తుతం 50 సీసీ కెమెరాలున్నాయి. నిర్వహణ సక్రమంగా లేదు. పాత మార్చురీ వైపు దీపాలు వెలగడం లేదు. చీకటి పడితే వెళ్లాలంటే భయపడుతున్నారు. అత్యవసర విభాగంలో అర్ధరాత్రి వేళ ఎవరైనా చనిపోతే వారిని మార్చురీకి తరలించడానికి భయపడుతున్నారు.
- నిలోఫర్ పిల్లల ఆసుపత్రి, పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టడం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలు, బాలింతలు ఇక్కడ చికిత్స పొందుతుంటారు. రాత్రి వేళల్లో సెక్యూరిటీని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
- ఎర్రగడ్డ మానసిక వైద్య కేంద్రంలో భద్రత లోపాల వల్ల గతంలో వార్డు గోడకు కన్నం పెట్టి 11 మంది ఖైదీలు తప్పించుకోవడం సంచలనం రేపింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి రెండు కాళ్లు నరికి ఆసుపత్రి భవనంపై దుండగుడు వదిలి వెళ్లాడు.
- గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌తోపాటు సాధారణ రోగులకు సేవలు అందిస్తున్నారు. మెడికల్ కళాశాల ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉంది. భద్రత మరింత అవసరం. గతంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మద్యం తాగుతూ పట్టుబట్టారు. నకిలీ డాక్టర్లు హల్‌చల్ చేశారు. రెండుసార్లు చిన్న పిల్లలను ఎత్తుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
- ఆసుపత్రిలో 120 వరకు సీసీ కెమెరాలున్నా చాలా వరకు పనిచేయడం లేదు. గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మరో 100 కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ప్రతిపాదనల దశ దాటలేదు.
ఇదీ చూడండి: TWINS RAPE CASE: తల్లి ప్రోత్సాహంతోనే బాలికలపై అత్యాచారం.. ఐదుగురికి జీవిత ఖైదు