ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన బాలిక(14)పై కన్నతండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి వికృత చేష్టలు భరించలేక ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వచ్చి ఏలూరు వైపు వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనని తాను పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని మాయమాటలు ఏలూరుకు తీసుకెళ్లాడు. ఓ గదిలో ఉంచి మరుసటి రోజు తల్లిదండ్రులకు అప్పగించాడు. తల్లి ఆరా తీయడంతో జరిగిందంతా చెప్పింది. తనను గదిలో ఉంచిన వ్యక్తి కూడా బలత్కారం చేయబోయాడని బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ పైడేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కీచక తండ్రి
పోలీసుస్టేషన్లో తనపై కేసు నమోదైందని తెలుసుకున్న బాలిక తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి : దారుణం... బాలికపై పదిహేను రోజుల నుంచి అత్యాచారం