Father and daughter commit suicide at Secunderabad railway station: ఓవైపు దివ్యాంగురాలైన కుమార్తె.. మరోవైపు భార్య చనిపోయిన బాధ.. ముసురుకున్న ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు భయపెడుతున్న వృద్ధాప్యం.. అవే ఆ తండ్రిని జీవితంలో కఠినమైన నిర్ణయం వైపు నడిపించాయి. ఈ కష్టాల కడలిని ఇక ఈదలేనంటూ.. ఆత్మహత్య చేసుకున్నాడు. తనొక్కడిని పోతే తన చిట్టితల్లికి దిక్కెవరు అనుకొని దివ్యాంగురాలైన ఆ కుమార్తెను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
మల్లాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ చారి, తన కూతురు ఉమారాణితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగాలేక ఆయన భార్య తనువు చాలించింది. అప్పటి నుంచి.. మల్లేష్ చారి దివ్యాంగురాలైన తన కూతురిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మరణం తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. దీనికి తోడు మీద పడుతున్న వృద్ధాప్యం, కుమార్తెను పోషించే దారి కనిపించడం లేదు. ఆపన్న హస్తం చూపే వారు కరవయ్యారు. ఎవరిని సాయం కోరినా మొండి చేయి ఎదురైంది.
దివ్యాంగురాలైన కుమార్తెకు రోజు సేవలు చేయడం, తనను తాను పోషించుకోవడం ఆ వృద్ధ తండ్రికి భారంగా మారింది. ఈ బతుకు భారం తన వల్ల కాదంటూ మల్లేష్ చారి తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈరోజు మౌలాలి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి తండ్రి, కుమార్తె కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలను చూసిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచార మిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి తండ్రి, కుమార్తె మరణం స్థానికులను కలిచివేసింది. ఇరువురి మరణంతో మల్లేష్ చారి స్వగ్రామం మల్లాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇరువురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఎవరైనా ముందుకొస్తే.. ఇంత కఠిన నిర్ణయం తీసుకునే వారు కాదని వాపోయారు.
ఇవీ చదవండి:
కుమార్తెల ముందే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించిన భర్త.. సీసీ కెమెరాలో దృశ్యాలు
ప్రాణం తీసిన పెండింగ్ చలానా.. పోలీసులు విచారించారని వ్యక్తి ఆత్మహత్య
భార్యల మరణాన్ని తట్టుకోలేక భర్తల ఆత్మహత్యలు.. ఒకెేరోజు రెండు వేర్వేరు ఘటనలు..