accident at Nallamala forest area: సినిమాల్లో సెంటిమెంట్ సీన్స్ వస్తే కంటతడి పెడతాం. విలన్ ఎవరినో చంపుతుంటే మనం బాధపడిపోతాం. ఆపదల్లో ఉన్న వారిని చూసి అయ్యో అంటాం. మనం చూస్తుంది సినిమానే అని మనకూ తెలిసినా.. కళ్ల ముందు కనిపించే దృశ్యాలకు కరిగిపోతాం. అలాంటిది నిజ జీవితంలో ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నా.. ఒక్కరూ పట్టించుకోలేదు. పక్క నుంచే వెళుతున్నా.. బండి ఆపి కనీసం అండగా నిలవలేదు. పోతూ పోతూ ఏ అంబులెన్స్కో అయినా ఫోన్ చేయలేదు. అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ తన వెనకాలే కూర్చున్న భార్య విగతజీవిగా పడిపోయి ఉన్నా.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తన కూతురిని కాపాడుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఓ మానవతావాది స్పందించి.. ముగ్గురినీ తన కారులో ఆసుపత్రికి తరలించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నల్లమల అడవిలో జాతీయ రహదారిపై జంబులయ్య కుటుంబంతో బైక్పై వెళ్తుండగా.. వారిని క్రాస్ చేసి ఓ జీపు ముందుకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా బస్సు రావడంతో జీప్ డ్రైవర్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించాడు. దీంతో వెనుక వస్తున్న జంబులయ్య బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది.
ఈ ప్రమాదంలో జంబులయ్యకు గాయాలు కాగా.. భార్య మైమ(26) తలకు గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది. తన పాప సాత్విక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. పాపను బతికించుకోవాలని జంబులయ్య అటు వైపు వచ్చిన ప్రతి వాహనాన్నీ ఆపేందుకు ప్రయత్నించారు. శివరాత్రికి గుడికి వెళ్లిన వారు తిరుగు ప్రమాణంలో చాలా మంది అటువైపుగా వచ్చినా.. ఏ ఒక్కరూ అతనిపై కనికరం చూపలేదు. బండి ఆపి సాయం చేయలేదు.
చివరికు ఓ కారు డ్రైవర్ అతడి బాధ చూసి ఆపాడు. ముగ్గురినీ స్థానిక వైద్యశాలకు తరలించాడు. పరిశీలించిన వైద్యులు మైమ చనిపోయిందని నిర్ధారించారు. కాస్త ముందుగా తీసుకొస్తే పాప బతికేదని చెప్పారు. ఆ మాట విన్న జంబులయ్య గుండె ఒక్కసారిగా ముక్కలైంది. ఏ ఒక్కరైనా సకాలంలో స్పందించి ఉంటే తన పాప బతికేదని అతడు ఏడ్చిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
ఇవీ చదవండి: