Farmers land compensation problems : రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి సకాలంలో పరిహారం అందడం లేదు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు కల్వకుర్తి, డిండి, సీతారామా, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద భూ సేకరణ పూర్తయిన రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. పలు గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. రైతులకు డబ్బులు ఇవ్వకుండానే నీటిపారుదల శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకుని పనులు చేపడుతున్నారు. దీంతో పంటను, ఇతర భూమికి నీటి ప్రవాహ మార్గాన్ని రైతులు కోల్పోతున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు నిధులు కూడా అందడం లేదు.
కనపడని అధికారులు
భూ సేకరణ సమయంలో హడావుడి చేస్తున్న నీటిపారుదల, రెవెన్యూ శాఖ (భూసేకరణ) అధికారులు పని అయ్యాక కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. పొలం అప్పగించినట్లు మా వద్ద సంతకాలు తీసుకోవడమే ఆలస్యం. వెంటనే పనులు చేపడుతున్నారు. భూమిలో కాల్వ తవ్వేస్తున్నారు. మళ్లీ కనిపించడం లేదు. అంటూ కల్వకుర్తి మండలంలోని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల డిస్ట్రిబ్యూటరీ పనులకు కాల్వలు తీశారు. ఇప్పటికీ పరిహారం అందించలేదు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మండలంలో సీతారామా ప్రాజెక్టు కింద ప్యాకేజీలు 9, 11, 12లలో 649 ఎకరాల భూమిని సేకరించారు. రూ.52 కోట్ల పరిహారం రైతులకు అందించాల్సి ఉంది.
* ఖమ్మం డివిజన్ పరిధిలోనూ పలువురు రైతులకు పరిహారం అందాల్సి ఉంది.
* ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా 1, 2; జూరాల ప్రాజెక్టుల కింద పోయిన 430 ఎకరాలకు రూ.110 కోట్లను అందజేయాల్సి ఉంది. కొందరు రైతులు ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నవారు ఉన్నారు.
* నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో డిండి ఎత్తిపోతల పథకం(డీఎల్‌ఐ)లో జలాశయం, ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణంలో మరో 1300 ఎకరాలకు సంబంధించి దాదాపు 2 వేల మంది రైతులు(వంగూరు మండలంలోనివారు తప్ప) పరిహారం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని కల్వకుర్తి ఆర్డీవో, రాజేశ్‌కుమార్ వెల్లడించారు.
న్యాయస్థానాలు చెబుతున్నా జాప్యమే..
భూ సేకరణ పరిహారం వీలైనంత వేగంగా బాధితులకు అందించాలని హైకోర్టు పలు మార్లు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. పరిహారం చెల్లింపులకు సంబంధించి దాఖలైన ఎగ్జిక్యూటివ్ పిటిషన్ల (ఈపీ) విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిహారం పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోంది.
ఈయన పేరు దాసరి వెంకటయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు శివారులో 287 సర్వే నంబరులో ఐదు ఎకరాల భూమి ఉండగా మూడేళ్ల క్రితం ఎనిమిది గుంటలను కల్వకుర్తి కాల్వ నిర్మాణానికి తీసుకున్నారు. దానికి రావాల్సిన పరిహారం రూ.80 వేలు. అప్పటి నుంచి అది అందక మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వెంకటయ్య వ్యయప్రయాసలకు గురవుతున్నారు. భూమికి పరిహారం దక్కక..దానిపై వచ్చే పంట ఆదాయమూ, రైతుబంధూ కోల్పోయి ఏటా కనీసం రూ.26 వేలు(3 ఏళ్లకు రూ.78వేలు) కోల్పోయారు.
ఈమె పేరు కౌసల్య. వనపర్తి జిల్లా పెద్దమందడి పామిరెడ్డి పల్లి గ్రామం. గ్రామ సర్వే నంబరు 566లో ఆమెకు మూడెకరాల పొలం ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల డి 8 ప్రధాన కాల్వ నుంచి వచ్చే బుద్ధారం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ఆమె పొలాన్ని రెండుగా చీలుస్తూ సాగింది. దీంతో ఒకటింపావు ఎకరం పోయింది. మూడేళ్లు(2019 నుంచి)గా ఆమెకు పంట లేదు.. పరిహారం లేదు. ఆమెతో బాటు గ్రామంలో మరో పదిమంది రైతులకూ పరిహారం అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: Kukatpally fire accident : కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. థియేటర్ పూర్తిగా దగ్ధం