రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటలు పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదన్న సాకుతో వ్యాపారులు ధరలు బాగా తగ్గించేశారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నందును రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్య- మార్క్‌ఫెడ్ (Markfed) పేర్కొంది.
అనుమతులు ఏవి...
ఇలా కొన్న పంటలను కొంతకాలం తర్వాత అమ్మినప్పుడు నష్టాలు వస్తే... భర్తీ చేస్తామని ప్రభుత్వం పూచీకత్తు ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలియజేయాలి. ఐదేళ్లుగా ఇలా కొన్న వివిధ పంటలను తిరిగి అమ్మినప్పుడు రూ. 2,100 కోట్ల మేర నష్టాలు వచ్చినా ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు. ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న జొన్న, మొక్కజొన్నను కొనడానికి ప్రభుత్వానికి కనీసం మార్క్‌ఫెడ్ లేఖ సైతం రాయలేదు. మరోవైపు ప్రభుత్వం రైతుల సమస్యలు గుర్తించి అనుమతి ఇవ్వడం లేదు.
యాసంగి వరకు...
యాసంగి సీజన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 19 వేల 597 ఎకరాల్లో జొన్న సాగు చేయగా... 93 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు మార్కెటింగ్‌శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మొక్కజొన్న సాగు చేయొద్దని వ్యవసాయశాఖ చెప్పినా రైతులు 4.66 లక్షల ఎకరాల్లో పంటవేయగా.. 13.07 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.
తక్కువ ధరకే...
మక్కలకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,850 చొప్పున ఇవ్వాలని కేంద్రం ఆదేశించినా... కేవలం 1,200 నుంచి 1,500 లోపే రైతులకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు తక్కువ ధరలకు 4.90 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేశారు. ఇంకా జొన్న, మక్కలు పెద్ద ఎత్తున మార్కెట్‌లకు వస్తున్న వేళ ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని వ్యవసాయ నిపుణులు కోరారు.
రేపోమాపో నివేదిక...
బిహార్ వంటి రాష్ట్రాల్లో పంట కోతకు వస్తున్న తరుణంలో... అది మార్కెట్లకు వస్తే దేశంలో ధరలు ఇంకా పడిపోతాయని మార్కెటింగ్ శాఖ (Marketing Department) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జొన్న, మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వానికి రేపోమాపో నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇదీ చదవండి:
తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు