రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు రుణం కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రైతులు ఏరువాకకు శ్రీకారం చుట్టారు. కానీ పెట్టుబడుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 1 కోటి 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు కాబోతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో అన్నదాతలకు సంస్థాగత పరపతి ఓ పెద్ద సవాల్‌గా మారింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) పంట రుణాల ప్రణాళిక విడుదల చేయకపోవడంతో రైతులకు రుణ పరపతి లభించడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ జిల్లాలో వ్యవసాయానికి ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలి...? ఏ బ్యాంకు ఎంత పంట రుణం ఇవ్వాలి...? అన్న లక్ష్యాలు నిర్దేశించలేదు. గ్రామీణ వ్యవసాయాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాబార్డు సంస్థ... ప్రతి ఆర్థిక సంవత్సరం రెండు మూడు మాసాల ముందుగానే రంగాల వారీగా ఫోకస్ పేపర్ విడుదల చేస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారం జనవరి 29న ప్రాధాన్యత రంగాలకు అందించే రుణ సాయంపై ఫోకస్ పేపర్‌ను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా విడుదల చేయించింది. 2021-22 వానా కాలం, యాసంగి సీజన్లకు కలిపి రైతులకు పంట రుణాల కోసం 59,440.44 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది నాబార్డు. ఈ ఫోకస్ పేపర్‌ను రిఫెరెన్స్ డాక్యుమెంట్‌గా తీసుకుని ఎల్‌ఎల్‌బీసీ... 2021-22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులు జిల్లాల వారీగా వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే... ఇంత వరకు రుణ ప్రణాళిక రూపొందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా ఆ ప్రభావం నేరుగా అన్నదాతలపై తీవ్రంగా చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
గత్యంతర లేక అధిక వడ్డీకి రుణాలు
పంటల సాగు ప్రారంభమైనా ఎస్‌ఎల్‌బీసీ రుణ వార్షిక కార్యాచరణ ప్రకటించకపోవడం పట్ల రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు లక్ష్యాలు ఖరారు కాలేదని చెప్పి బ్యాంక్లర్లు వెనక్కి పంపుతున్నారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి రాయితీ సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నా... అవి ఎకరానికి 5 వేల రూపాయలు కావడం... వరి, పత్తి, కంది, మిరప, సోయాచిక్కుడు లాంటి పంటలు సాగు చేయాలంటే ఎకరానికి 30 నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతున్నందున గత్యంతరం లేని పరిస్థితుల్లో అనివార్యంగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం... వరి పంటకు 34 నుంచి 38 వేల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. పంట రుణాలు సకాలంలో అందాలంటే ఎస్‌ఎల్‌బీసీ సమావేశమై వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించాల్సి ఉంటుంది. వార్షిక రుణ ప్రణాళిక కింద మొత్తం 1,35,780.33 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిన నాబార్డ్... కీలక వ్యవసాయ, మార్కెటింగ్ రంగాలకు పంపిణీ చేసేందుకు 59,440.44 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం ద్వారా పెద్దపీట వేసింది. గతేడాది 51,082.72 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు పంపిణీ చేసింది. సాగు నీటి వనరుల కల్పన కోసం 957.88 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం 2,972.48 కోట్లు, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, పట్టు పురుగుల పెంపకం కోసం రైతులకు రూ. 1,563.88 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్దేశించింది. కొవిడ్ నేపథ్యంలో కుదేలైన రైతులకు సంస్థాగత రుణాలు కనీసం ఇప్పటికైనా పంపిణీ చేయాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
పంటల వారీగా పెట్టుబడి
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరి సాగు, నీటి పారుదల సౌకర్యం గల భూమికి ఎకరానికి రూ. 34 నుంచి 38 వేలు రుణం ఇవ్వాల్సి ఉంటుంది. విత్తనోత్పత్తి సాగుకైతే రూ. 42 నుంచి 45 వేల రుణం ఇవ్వాలి. అదే జిల్లాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం తీసుకుంటే రూ. 40 వేలు, మహబూబ్‌నగర్‌లో 36 నుంచి 45 వేలు, ఆదిలాబాద్‌లో 40 నుంచి 44 వేలు చొప్పున ఇవ్వాలి. వేరుశనగకు నీటి పారుదల ఉంటే రూ. 24 నుంచి 26 వేలు, మెట్ట భూములకు రూ. 19 నుంచి 21 వేలు రుణం ఇవ్వాలి. పత్తికి ఎకరానికి రూ. 35 నుంచి 38 వేలు, అదే విత్తనోత్పత్తి కోసమైతే లక్షా పదివేల నుంచి లక్షా 40వేల రూపాయల రుణం లభిస్తుంది. మిరప సాగుకు ఎకరానికి రూ. 60 నుంచి 70 వేలు రుణం ఇవ్వాలి. కంది సాగుకు నీటి వసతి ఉంటే రూ. 17 నుంచి 20 వేలు, నీటి పారుదల లేకపోతే రూ. 15 నుంచి 18 వేలు, సేంద్రీయ సాగు కోసం 17 నుంచి 20 వేల రూపాయలు రుణం ఇవ్వాలి. శనగ పంటకు 20 నుంచి 22 వేల రూపాయలు, పొద్దుతిరుగుడు పంట సాగుకు 22 నుంచి 24 వేల రూపాయలు, అదే విత్తనోత్పత్తికి 28 నుంచి 31 వేల రూపాయల అప్పు లభిస్తుంది. చెరుకు ప్లాంటేషన్‌కు 70 నుంచి 75 వేల రూపాయల రుణం వర్తిస్తుంది.
రైతుల విజ్ఞప్తి
రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసినట్లయితే ఈ దురవస్థ రైతులకు వచ్చేది కాదన్న వాదన వినిపిస్తోంది. రైతుబంధు పాత రుణాల కింద జమ చేసుకోకుండా కొత్త అప్పులిచ్చి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో బ్యాంకుల ఎదుట ఆందోళనలు చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.
ముగిసిన పెట్టుబడి సాయం
రాష్ట్రంలో రైతుబంధు పెట్టుబడి సాయం ముగిసింది. ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల 84వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 7,360.41 కోట్లు జమయ్యాయి. 147.21 లక్షల ఎకరాలకు నగదు పంపిణీ పూర్తయింది. రైతుబంధు రాకుండా మిగిలిపోతే రైతులు ఏఈఓలను సంప్రదించి ఖాతాల వివరాలు సమర్పిస్తే నిధులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు సొమ్మును బ్యాంకర్లు పాతబాకీల కింద జమచేసుకోవద్దని, ఒకవేళ జమచేసుకున్న బ్యాంకులు తిరిగి అందజేయాలని కోరారు.
ఇదీ చదవండి: Water War: ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'