అకాల వర్షాలు, వడగళ్లు, కరవు వంటి విపత్తులకు పంటలు దెబ్బతిన్నా రైతులకు సాయం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గతేడాది నుంచే పంటల బీమా పథకం అమలు నిలిపివేయడం ఇందుకు కారణం. మామిడి, అరటి వంటి ఉద్యాన పంటలను సాగు చేసిన రైతులకు నష్టం ఎక్కువగా ఉంటోంది. అరటి తోట సాగుకు ఏడాదికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మామిడి, అరటి వంటి ఉద్యాన పంటలు 8,625 ఎకరాల్లో దెబ్బతినడంతో 2,086 మంది రైతులు రూ.6.26 కోట్ల పంటను నష్టపోయారని ఉద్యానశాఖ ప్రాథమిక అంచనా. పథకం అమల్లో ఉంటే ఈ సొమ్ములో 90 శాతం రైతులకు పరిహారంగా వచ్చేదని ఉద్యానశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక వేలాది టన్నుల వరి ధాన్యం కల్లాల్లోనే తడిసిపోయింది. కోతకు వచ్చిన పైరు నేలవాలి ధాన్యం రాలిపోయి రైతులు లబోదిబోమంటున్నారు.
2018 నుంచి అందని పరిహారం
2018-19, 2019-20లలో వానాకాలం, యాసంగి(రబీ) కలిపి మొత్తం 4 పంట సీజన్లలో రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పథకం కింద రూ.900 కోట్లకు పైగా పరిహారం రెండేళ్ల క్రితమే వచ్చింది. అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ రూ.450 కోట్ల ప్రీమియం రాయితీని కంపెనీలకు విడుదల చేయలేదు. దీంతో పరిహారం ఇచ్చేందుకు బీమా కంపెనీలు నిరాకరించాయి. 2018 నుంచీ రైతులకు పరిహారం అందలేదు. 2020 వానాకాలం నుంచి పథకం అమలునే నిలిపివేశారు.
* పత్తి, ఆయిల్‌పాం, బత్తాయి, మామిడి, టమాటా తోటలకు 2020 మార్చి వరకూ యాసంగి సీజన్‌లో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద చెల్లించిన ప్రీమియంకు 100 రెట్ల పరిహారం వస్తుంది. కానీ, పథకం అమలు నిలిపివేయడంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.
మామిడి కాయలు ఎవరూ కొనట్లేదు
నాకు 8 ఎకరాల మామిడి తోట ఉంది. అకాల వర్షాలు, గాలులకు మామిడి పిందెలు, కాయలు రాలిపోయాయి. చెట్లపై ఉన్న కాయలపై వర్షాలకు మచ్చలు ఏర్పడటంతో ఎవరూ కొనడం లేదు. రూ.4 లక్షల దాకా పెట్టుబడి నష్టపోయాను. పంటల బీమా పథకం ఉంటే ప్రీమియం సొంతంగా కట్టుకుని బీమా చేయించుకునేవాడిని. ఇప్పుడు జరిగిన నష్టానికి పరిహారం వచ్చేది.
-చిందిరాల నాగేంద్రం, ఉసిర్లగూడెం, అశ్వారావుపేట మండలం, భద్రాద్రి జిల్లా
రూ. లక్ష నష్టం వాటిల్లింది
10 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశాను. తీరా పంట చేతికొచ్చాక అకాల వర్షాలకు ధాన్యం తడిసి 20 క్వింటాళ్ల వరకు మొలకలు వచ్చి నష్టం వాటిల్లింది. అమ్మకానికి తీసుకెళ్తే నాణ్యత లేదని మిల్లర్లు క్వింటాకు 7 కిలోల చొప్పున తరుగు కింద తీశారు. మొత్తం రూ. లక్ష నష్టం కలిగింది. శ్రమంతా వృథా అయింది. పంటల బీమా పథకం ఉండి ఉంటే కనీసం పరిహారమైనా వచ్చేది.
-మైల జయరాంరెడ్డి, బోరునర్సాపురం, మంగపేట మండలం, ములుగు జిల్లా
ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించిన ప్రభుత్వం