అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న పోరాటం ఉగ్రరూపు దాల్చింది. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలు జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత ఒక్కసారిగా రూపుమార్చుకున్నాయి. కమిటీ నివేదికలోని అంశాలు బయటకు వచ్చిన వెంటనే... రైతులు సచివాలయ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధనగ్న ప్రదర్శనలతో తమ ఆక్రోశం వెలిబుచ్చారు. మహిళలు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు.
తమను సంప్రదించకుండా జీఎన్ రావు కమిటీ నివేదిక ఎలా ఇస్తుందంటూ... అమరావతి ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోయారు. కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందడం, మల్కాపురం ప్రాంతాల్లో రోడ్లపైకి పెద్దఎత్తున వచ్చిన జనం... సీఎం పోస్టర్లు చించారు. వారిని నివారించటం పోలీసులకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలో రైతులకు... పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
జీఎన్ రావు కమిటీకి చట్టబద్ధత ఏముందని అమరావతి అన్నదాతలు నిలదీస్తున్నారు. నమ్మి భూములు ఇచ్చినందుకు తమను జగన్ నట్టేట ముంచారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న సీఎం జగన్... చేతగాని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకోనే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు హెచ్చరించారు.
ఇవాళ రాయపూడిలో వంటావార్పు, వెలగపూడిలో రిలే దీక్షలు, తుళ్లూరు, మందడంలో మహా ధర్నాలు చేయాలని రైతులు నిర్ణయించారు. రాజధాని కోసం జరుగుతున్న పోరాటంలో... ఇతర ప్రాంతాల వారినీ కలుపుకొని పోవాలని సన్నద్ధమయ్యారు. రైతుల ఆందోళనలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆందోళనకారుల వివరాలు సేకరించడం... బాడీ కెమెరాల ద్వారా దృశ్యాలు చిత్రీకరించడం చేస్తున్నారు. రైతుల నిరసనలపై ఆంక్షలు విధించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం