వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే ఆర్డినెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏఐకేఎస్ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు దగ్గర ఆర్డినెన్స్ కాపీలను దగ్ధం చేశారు. ఈ నెల 5 న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు ఆర్డినెన్సులు రైతులకు వ్యతిరేకంగా... కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు.
ఒప్పంద వ్యవసాయం వల్ల ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ''ఒకేదేశం - ఒకే మార్కెట్'' పేరుతో వచ్చిన ఆర్డినెన్స్.. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తెలిపారు. కానీ... చిన్న- సన్నకారు రైతులు దగ్గరలో ఉన్న మార్కెట్‌లకు వెళ్లడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది రాష్ట్రాలు దాటి అమ్ముకోవడం సాధ్యం కాదన్నారు. ఇది బడా వ్యాపార వేత్తలకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆరోపించారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ మూడు ఆర్డినెన్స్‌లు ఉపసంహరించే విధంగా పార్లమెంట్‌లో కృషి చేయాలని కోరారు.