రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ప్రదర్శనలు చేపట్టారు.
సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను భాజపా ప్రభుత్వం దౌర్జన్యంగా ప్రవేశపెట్టిందన్నారు. వెంటనే రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు.
ఖమ్మం జిల్లా మధిరలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుంచి కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సుందరయ్యనగర్ సెంటర్లోని మధిర- విజయవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఆదిలాబాద్‌లో అఖిలపక్ష రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది. కాంగ్రెస్, వామపక్షాల రైతు సంఘాలతో పాటు అఖిలపక్ష రైతు సంఘాలు... కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్, వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా బిల్లులను రూపకల్పన విద్యార్థి నాయకులు మండిపడ్డారు. బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకునే వరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కొత్త బిల్లులతో కేంద్రం రైతుల నడ్డి విరుస్తోందని నాయకులు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బిల్లులను ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.