రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నా తెరాస ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రభుత్వంమొద్దు నిద్ర పోతోందని ఆక్షేపించారు. ఇవాళ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని భాజపా ప్రతినిధుల బృందం కలిసి రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించి... వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తాగునీరు గోడు పట్టదా..?
అనేక గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నా... ప్రభుత్వం ప్రత్యామ్నాయ కార్యాచరణపై దృష్టి సారించడంలేదని దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని... బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రి కనీసం వర్షాభావ పరిస్థితులపై సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపితే సాయం చేయాలని భాజపా తరపున కేంద్రాన్ని కోరుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!