Fake Notes in Pension Distribution : పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో లావాదేవీ చేస్తుండగా నకిలీ నోటుగా గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకురాగా, పంపిణీ సొమ్ములో మరికొన్ని నకిలీ నోట్లు కనిపించాయి. పింఛన్ల నగదులో రూ.500 నకిలీ నోట్లు 38 వరకూ గుర్తించారు. వీటిని తిరిగి తీసుకున్న వాలంటీరు అధికారులకు అప్పగించారు.
"మేము ప్రతి నెలా చివరిలో బ్యాంకుకి వెళ్లి పింఛను డబ్బు తీసుకొని వస్తాం. తరువాత వాలంటీర్లను పిలిపించి.. వారి పింఛన్ల లిస్ట్ చూసి.. పంపిణీ చేస్తాం. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పింఛను పంపిణీ మొదలుపెట్టారు. నాకు 7 గంటలకు ఫోన్ వచ్చింది. అధికారులమంతా వచ్చాం. మొత్తం 38 నోట్లు.. రూ.19 వేల ఫేక్ నోట్లు వచ్చాయి". - వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి
"నేను తెల్లవారే సరికి పింఛన్లు ఇచ్చేశాను. తెల్లవారిన తరువాత.. ఇవి దొంగనోట్లు అని పింఛను తీసుకున్నవారు చెప్పారు. నేను వాటిని పరిశీలించి.. అధికారులకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి వాటిని తీసుకువెళ్లారు". - వాలంటీరు
ఇవీ చదవండి: