Fake Loan Documents Gang Arrested in Hyderabad : నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల నుంచి పలు రకాల రుణాలు ఇప్పిస్తున్న రెండు ముఠాలను(Fake Documents Gang Arrest) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధుల్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బాలానగర్ ఎస్‌వోటీ(SOT) పోలీసుల సాయంతో రెండు ముఠాల్లోని 18 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 1687 నకిలీ రబ్బరు స్టాంపులు, 1180నకిలీ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర(CP Stephen Ravindra) వివరించారు.
నిందితులు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఎ, రెవెన్యూ డిపార్టుమెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నేరగాళ్లు ఏజెంట్ల సాయంతో వారికి గృహ, ఇతర రుణాలు ఇప్పిస్తున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు ఇప్పించడంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉండే అవకాశం ఉందని.. అందుకోసం దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. రెండు నెలలుగా ఈ కేసు పైన దృష్టి పెట్టి ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను పట్టుకున్నామన్నారు. ఇప్పటివరకు సుమారుగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
Mewat Gang Arrest : విమానాల్లో వస్తారు.. సూటూబూటు వేసుకుని ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడతారు!
"కూకట్‌పల్లిలో సుధాకర్ అనే వ్యక్తి హోం లోన్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఎవరైనా ఇంటి లోన్ కావాలనుకుంటే అతడిని సంప్రదిస్తారు. ఆయన ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకొని.. వేరే వ్యక్తి, ప్రధాన నిందితుడు రంగారావు వద్దకు పంపిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తారు. వారే స్వయంగా బ్యాంకులో ఆ పేపర్లను ఇచ్చి ఇంటి లోన్ ఇప్పిస్తారు. ప్రధాన నిందితుడు రంగారావును 2005, 2012లో కూడా ఫేక్ డాక్యుమెంట్ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద ప్రధానంగా మూడు టీంలు ఉంటాయి. అందులో మొదటి టీం ఫేక్ లేఅవుట్‌లు తయారు చేస్తారు. రెండో టీం డాక్యుమెంట్లను తయారు చేస్తారు. మూడో టీం రబ్బరు స్టాంపులను తయారు చేస్తారు. అందుకు సంబంధించ 18మంది వ్యక్తులను అరెస్టు చేశాం." - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
Fake Loan Documents in Hyderabad : వీరి వద్ద నుంచి 10 లాప్‌టాప్‌లు, 8 ప్రింటర్స్, స్టాంపులను తయారు చేసే యంత్రాలు, 57సెల్‌ఫోన్‌లు, వాహనాలను సీజ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు. ఇవే కాకుండా నిందితులు వాడే డూప్లికేట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠా ఎక్కువగా హోం లోన్ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీరికి సిటీ మొత్తం చాలా మంది ఏజెట్లు ఉన్నారని వారిపై కూడా విచారణ జరుపుతున్నామని సీపీ ప్రకటించారు.