Fake Insurence Certificates Gang Arrest In Hyderabad: ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని సేవలు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. సెల్‌ఫోన్ రీచార్జ్ నుంచి పెద్ద సేవలు వరకు దేనికైనా.. ఇప్పుడు ఆన్లైన్లోనే మొత్తం చేయించుకుంటున్నారు. బీమా సంస్థలకు సంబంధించిన సేవలు కూడా అంతర్జాలం ద్వారానే ఇంటి దగ్గర ఉంటూనే కట్టేస్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్‌ను కూడా అలానే చేస్తున్నారు. అదే ఆదునుగా భావించిన ఒక ముఠా డైరెక్ట్‌గా వాహన ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లనే.. నకిలీగా తయారు చేసి ఈజీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు.
నగరంలో వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేసి.. విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను ముఠాను మాదాపూర్ జోన్, మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను, రెండు కంప్యూటర్లను, నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. హఫీజ్‌పేట్‌కు చెందిన మహ్మద్ సర్వర్ షరీఫ్, సంగారెడ్డికి చెందిన మిర్జా ఇలియాజ్ బేగ్, షేక్ జమీల్, అజహర్ వీరి నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల దందా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐసీఐసీఐ లాంబార్డు, జనరల్ ఇన్సూరెన్స్, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఇర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు చెందిన వాహనాల నకిలీ సర్టిఫికేట్లను ఈ ముఠా తయారు చేసి విక్రయిస్తున్నారని ఆమె తెలిపారు.
నిందితులు హఫీజ్‌పేట్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని.. దందాను కొనసాగిస్తున్నారని డీసీపీ శిల్పవల్లి వివరించారు. ద్విచక్ర వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల రూ. 500 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు . అలాగే ఆటోలు, కార్లు వంటి వాహనాలకు రూ. 2000 నుంచి రూ. 2500 వరకు అమ్ముతున్నట్లు వివరించారు. రెగ్యూలర్ ఇన్సూరెన్స్ చేయించాలంటే ఒక ఫోర్ వీలర్‌కు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు అవుతుందని అన్నారు. అదే ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే కనుక ఒక రూ. 3000తో సరిపోతుందని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సల్వార్ షరీఫ్ 2019 నుంచి కస్టమర్ సర్వీస్ పాయింట్ పేరిట కంప్యూటర్ కేంద్రం నిర్వహించే వాడని అన్నారు. పరారీలో ఉన్న నిందితుడు అజహర్ కోసం పోలీసులు గాలిస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి: