Hyderabad Metro Charges hike: మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అందజేసేందుకు ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి తపాలా, మెయిల్ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవనున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు మొదలై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తున్న తరుణంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్‌గా, కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఐఏఎస్ అధికారి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత నెలాఖరులో హైదరాబాద్‌లో సమావేశమైన ఈ కమిటీ ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15వ తేదీలోగా తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది.
మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి: ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత అప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలను త్రిసభ్య కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పరిశీలించనుంది. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఇచ్చే ఛార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలించనుంది. నిర్వహణ వ్యయం వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించనుంది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఏ మేరకు ఛార్జీలు పెంచడం సబబో కమిటీ నిర్ణయిస్తుంది.
ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైలు ఛార్జీల పెంపు భారీగానే ఉండనుంది అనేది సమాచారం. ఇప్పుడు పెంచితే మళ్లీ ఐదేళ్ల తర్వాతనే సవరణకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐదేళ్లు పూర్తి కానుండటంతో ఛార్జీలు భారీగా పెంచి రాయితీలు ఇచ్చే అవకాశం లేకపోలేదని మెట్రో వర్గాల నుంచి తెలుస్తోంది.
ఇవీ చదవండి: