కరోనా తీవ్రత కారణంగా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూన్ 15 వరకు పొడిగించారు. జూనియర్ కాలేజీలతో పాటు మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
కరోనా తీవ్రత కారణంగా దరఖాస్తుల గడువును జూన్ 15 వరకు పొడిగించామని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తామన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా చదివినవారు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించామని కన్వీనర్ సీహెచ్ వెంకట రమణారెడ్డి వెల్లడించారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం 50 రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసే గడువును ఈనెల 31 వరకు పొడిగించామని టాస్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి మే నెల సాయం విడుదల