Telangana Police Recruitment 2022: పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తు పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో రెండేళ్లు పొడిగిస్తూ సర్కారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన ప్రభుత్వం... తాజాగా మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లు సడలింపు ఇచ్చినట్లైంది. అయితే వయో పరిమితి పెంచినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవాళ రాత్రి వరకు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తు పోలీసు నియామక మండలి నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో నిరుద్యోగ యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి.
17,291 ఉద్యోగాల భర్తీ: పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో 17వేల 2 వందల 91 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 2వ తేదీన ప్రారంభమమైన ప్రక్రియ 26న ముగియనుంది. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా అధికారులు సామర్థ్యాన్ని పెంచారు. నిన్న ఒక్క రోజే లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో, సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. నగదు చెల్లింపుజరిగితేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు డెబిట్ అయినా... వారం వ్యవధిలో తిరిగి ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. వచ్చే మార్చి కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: