హైకోర్టు తీర్పు కారణంగా సీఎస్ సోమేశ్‌కుమార్ రిలీవింగ్ నేపథ్యంలో తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంశం ఉత్కంఠగా మారింది. సీఎస్ విషయంలో ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, అశోక్ కుమార్, అర్వింద్ కుమార్ ఉన్నారు. వీరిలో వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాణి కుమిదిని కార్మిక శాఖ, శాంతికుమారి అటవీశాఖ బాధ్యతల్లో ఉన్నారు. సునీల్ శర్మ ఇంధన శాఖ, రజత్ కుమార్ నీటి పారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థికశాఖ, అర్వింద్ కుమార్ పురపాలక శాఖ బాధ్యతల్లో ఉన్నారు.
రేసులో ఆ ఇద్దరు..?: రాణి కుమిదిని పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. శాంతి కుమారి 2025 ఏప్రిల్ వరకు ఉంటారు. సునీల్ శర్మ 2024 మే వరకు, రజత్ కుమార్ ఈ ఏడాది నవంబర్ వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు 2025 ఆగస్టు వరకు, అర్వింద్ కుమార్ 2026 ఫిబ్రవరి వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ పేర్లు సీఎస్ రేసులో బలంగా ఉన్నాయి. రజత్ కుమార్, సునీల్ శర్మ, శాంతి కుమారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరందరిలోనూ రామకృష్ణారావు ఒక్కరే తెలంగాణ స్థానికత కలిగిన అధికారి.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని..: ఈ ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సీఎస్‌ను నియమించనున్నారు. కొత్త సీఎస్ నియామకంతో పాటు సోమేశ్‌కుమార్ ప్రస్తుతం చూస్తున్న రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, సీసీఎల్ఏ, గనుల శాఖ బాధ్యతలను కూడా ఇతర అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.
ఇవీ చూడండి..
సీఎస్‌కు మరో షాక్.. తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు