క్షేత్ర స్థాయి పోలీసుల్లో జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు అధికారులు నడుం బిగించారు.. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. చాలా ఠాణాల్లో గతంలోనే ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా పనిచేయడం లేదు. ఉన్న వాటిని మరమ్మతు చేయడంతోపాటు కొత్తగా 1,300 కెమెరాలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
మరో 3 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయబోతున్నారు. టెండర్ ప్రక్రియ చివరి దశలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరియమ్మ కస్టోడియల్ డెత్ నేపథ్యంలో ఠాణాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాటుకు నడుం బిగించారు.
ఇప్పటికే 7 లక్షల కెమెరాలు
సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే ముందున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 7 లక్షల కెమెరాలున్నాయి. మొత్తం పది లక్షలు ఏర్పాటు చేయడం అధికారుల లక్ష్యం. వీటిని ప్రధానంగా అసాంఘిక శక్తుల ఆనుపానులు తెలుసుకునేందుకు ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలను గమనించి వారిని అదుపులోకి తీసుకునేందుకు, నేరాల దర్యాప్తునకూ ఇవి కీలకంగా మారాయి. గత ఏడాది మొత్తం 4,490 కేసులను సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో పరిష్కరించగలిగారు. నిందితుల దృశ్యాలు నమోదు అవుతుండటంతో న్యాయవిచారణకూ ఇవి బలమైన ఆధారాలుగా మారుతున్నాయి.
రూ.70 కోట్లతో సీసీ కెమెరాల ఏర్పాటు..
రాష్ట్రంలో మొత్తం 746 పోలీస్‌స్టేషన్‌లతోపాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలు 92 ఉన్నాయి. వీటన్నింటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.70 కోట్లను వెచ్చిస్తున్నారు. అన్నింటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తుండటంతో ఉన్నతాధికారులూ రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌లో ఏం జరుగుతుందో పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి: GOVERNOR TAMILISAI: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం