నిజమైన పీవీ నరసింహారావు అంటే ఎవరో ప్రపంచానికి చాటి చెప్పేలా, ఆయన ఘనకీర్తి అందరికీ తెలిసేలా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన లోగోను కమిటీ ఛైర్మన్ కేశవరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పీవీ కుటుంబసభ్యులు ఆవిష్కరించారు.
ఏడాది పాటు..
కాకతీయ తోరణం, అశోక చక్ర చిహ్నాలు, పీవీ చిత్రపటంతో ఈ లోగోను రూపొందించారు. ఏడాది పాటు ఘనంగా నిర్వహించే శతజయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని... పీవీ సేవలపై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించి... ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక పుస్తకం తీసుకొస్తామని కేశవరావు తెలిపారు. పీవీ గురించి పూర్తి నిజాలు తెలిసేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపిన గొప్ప వ్యక్తి నరసింహారావుకు దురదృశ్టవశాత్తూ రావాల్సినంత గొప్ప పేరు రాలేదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను గొప్పగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన పీవీ కుటుంబ సభ్యులు... పీవీ గురించి తెలిసింది కొంత, తెలియాల్సింది చాలా ఉందన్నారు. నిజమైన పీవీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు శతజయంతి ఉత్సవాలు ఓ మంచి కార్యక్రమంగా అభివర్ణించారు.
ఇవీ చూడండి: పీవీకి భారతరత్న కోసం ప్రధాని వద్దకు వెళ్తా: కేసీఆర్