టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy white challenge) విసిరిన వైట్ ఛాలెంజ్‌ను మంత్రి కేటీఆర్( Minister KTR) స్వీకరించకపోవడం దురదృష్టకరమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (konda vishweshwar reddy)అన్నారు. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఆయన గన్‌పార్కు వద్దకు వచ్చి మాట్లాడారు. ఒక మంత్రిగా తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సవాల్ స్వీకరించకుండా స్థాయి గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ఒక నాయకుడు ఎప్పుడైతే స్థాయి గురించి మాట్లాడతాడో అప్పుడే అతని రాజకీయ జీవితం అంతమైనట్లేనని వ్యాఖ్యానించారు. ఉన్నతస్థాయిలో ఉన్న నాయకుడు కిందిస్థాయి వాళ్ల వద్దకు వస్తేనే మరింత గౌరవం పెరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించారు. దీక్షలో కూర్చుని వేదిక పంచుకున్నారు.
సవాల్‌ను స్వీకరించమంటే తాను రాహుల్‌గాంధీ స్థాయి అంటూ విచిత్రమైన కారణాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అమెరికాలో చిన్న ఉద్యోగం చేయాలంటేనే డ్రగ్స్ టెస్ట్ సమర్పించాలని తెలిపారు. అలాంటిది యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. తాను కూడా మరో ఇద్దరికి వైట్ ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తాను సవాల్ విసురుతున్నట్లు తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగం కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఛాలెంజ్ విసురుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశం రెండు రాజకీయ పార్టీల మధ్య యుద్ధంలా మారడం తనకు ఇష్టం లేదన్నారు. ప్రజాజీవితంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రనిధులు, ప్రముఖులు ముందుకొచ్చి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు డ్రగ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్తామని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
కేటీఆర్ గారు ముందుకొస్తే తనస్థాయి కూడా పెరుగుతది. అంతేకాకుండా నాస్థాయి వేరే.. నాది రాహుల్ గాంధీ స్థాయి అని మాట్లాడుతాడు. ఎంత పెద్దస్థాయిలో ఉన్న చిన్న చిన్న వాళ్ల దగ్గరకు వెళ్తేనే స్థాయి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే స్థాయి గురించి మాట్లాడుతారో అప్పుడే ఆయన రాజకీయ జీవితం ఖతమైనట్లే. సైదాబాగ్ ఘటనకు డ్రగ్స్ కారణం. డ్రగ్స్ కేసులో ఈడీకి కూడా తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే డ్రగ్స్ టెస్ట్ సమర్పించాలి. మనదేశంలో కూడా రాజకీయ నాయకులు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డ్రగ్స్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. దయచేసి మంత్రి కేటీఆర్ గారు సవాల్ స్వీకరించి ముందుకొస్తే బాగుంటుంది. మనం యువతకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరముంది. నేను కూడా మరో ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సవాల్ విసురుతున్నా.- కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ
ఇదీ చూడండి: KTR AND REVANTH TWITTER WAR: టాలీవుడ్ డ్రగ్స్ కేసు టు వైట్ ఛాలెంజ్ వయా ట్విటర్ వార్