పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాములు నాయక్... రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత వర్గాల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓసీల గర్జన సమావేశంలో బీసీ, దళితులను కించపరిచే విధంగా ధర్మారెడ్డి ప్రసంగించారని రాములు నాయక్ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.
ధర్మారెడ్డి ఇంటిపై భాజాపా నాయకులు దాడి చేస్తే స్పందించిన మంత్రి కేటీఆర్.. అదే ఎమ్మెల్యే తమ జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎందుకు స్పందించరని రాములు నాయక్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెబితే సరిపోదని, బీసీ, దళిత వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఆయనపై సీఎం కేసీఆర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తాను వేసిన కేసును స్వీకరించిన ఎస్హెచ్ఆర్సీ.. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ సీపీతో యూఎస్ కౌన్సిలేట్ భద్రతాధికారి భేటీ