మాతృభాష బలోపేతంతోనే మన విద్యావ్యవస్థ వృద్ధి ఆధారపడి ఉందన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు. నవీకరణ, ఇతర భాషలపై వ్యామోహంతో ప్రపంచంలో వారానికి రెండు భాషలు అంతరించిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మేధావులు కాలేరు..
తెలుగు మాట్లాడకుండా మేధావులు కాలేరని విద్యాసాగర్ రావు హెచ్చరించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం ఉండాలని యునెస్కో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. బేగంపేట హరిత ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తాను ప్రాణాలతో ఉన్నంత కాలం తెలుగు భాష కాపాడే విధంగా కృషి చేస్తానని అన్నారు. మాతృభాష మాట్లాడి, కాపాడుకొని బంగ్లాదేశ్ దేశం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
ప్రాచీన భాష హోదా..
తెలుగు ప్రాచీన భాష హోదాను పొందిందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా వారి మాతృ భాషను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. అంతరించి పోయే భాషలు ఉన్నాయనే యునెస్కో మాతృ భాష దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు రమణ చారి తెలిపారు. ఇంగ్లీష్ ఉంటే ఉద్యోగాలు దొరుకుతాయి అంటారు.. కానీ తెలుగులో చదివి కూడా ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారని వ్యాఖ్యానించారు. మాతృ భాషతో అవగాహన, అర్థం చేసుకునే పరిజ్ఞానం పెరుగుతుందని వివరించారు. అన్ని భాషలూ నేర్చుకోవాలి, నిష్ణాతులు కావాలి కానీ.. మాతృభాషను మరిచిపోవద్దని హితవు పలికారు.
ఇవీ చూడండి: పూరీ తీరంలో మహాశివుని సైకత శిల్పాలు