రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉన్నత విద్య ప్రవేశాలు, కొలువుల భర్తీలో ఈడబ్ల్యూఎస్ పేరిట ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చినా.. ఆ కోటాలో లబ్ధి పొందలేక వేల మంది నిరుద్యోగ యువత అర్హత కోల్పోతున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు అయినప్పటికీ సాగుభూమి 5 ఎకరాలకు మించి ఉందంటూ సదరు దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం తిరస్కరిస్తోంది. ధ్రువపత్రాలు అందకపోవడంతో నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేయడంతో.. కొలువులకు దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని, ఫలితాల సమయంలో ఇస్తే చాలని టీఎస్‌పీఎస్‌సీ, పోలీసు నియామక బోర్డు అధికారులు ప్రకటించారు. దానివల్ల అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నా.. పరీక్షల తర్వాత ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది.
అర్హతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఇవీ..
కేంద్రం చెప్పింది ఇదీ..: 10 శాతం రిజర్వేషన్‌పై కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేసింది. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. సాగు భూమి 5 ఎకరాలకు మించరాదు. చిన్న పట్టణాల్లో 1000 చదరపు అడుగులు లేదా నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో అయితే 100 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి. అంటే వాటిల్లో ఏది వర్తించకున్నా కోటాకు అర్హులు కాదు. రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నది ఇలా: రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 2021 ఫిబ్రవరిలో సాధారణ ప్రభుత్వ పరిపాలనాశాఖ జీఓ 33, 65లను జారీ చేసింది. మళ్లీ ఆగస్టు 24న ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హత ఏమిటో మార్గదర్శకాలను పొందుపరుస్తూ జీఓ 244ను జారీ చేసింది. అందులో ఆర్థిక సంవత్సరంలో పొందిన వేతనం, వ్యవసాయం, వృత్తి, వ్యాపారంపై వచ్చిన ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొంది.
తహసీల్దార్ ధ్రువపత్రం ఇవ్వడం లేదు..
మాది వనపర్తి జిల్లా అమరచింత మండలం. గ్రూప్ 1,2,4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం. మా కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉంది. వ్యవసాయ భూమి 8 ఎకరాలు ఉంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందాలంటే భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉంటే చాలు. తహసీల్దార్ వద్దకు వెళితే ఈడబ్ల్యూఎస్‌కు అర్హులు కాదని ధ్రువపత్రం ఇవ్వడం లేదు. -కొట్ట శశిధర్‌రెడ్డి, హెల్త్‌కేర్ పీజీ, పాలమూరు విశ్వవిద్యాలయం
వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్నా..
నేను ఎంఈడీ ఫైనలియర్ చదువుతున్నాను. టెట్తో పాటు గ్రూప్ 1,2,4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. వార్షికాదాయం రూ.8 లక్షలలోపే ఉంది. అయిదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నందున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి జీఓ 244 ప్రకారం వార్షికాదాయం ఆధారంగా ధ్రువపత్రం ఇవ్వాలి. - సామినేని వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా
కేంద్రం మార్గదర్శకాలనే తహసీల్దారు పాటిస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ 244లో ఎక్కడా భూమి గురించి ప్రస్తావన లేదు. రెవెన్యూ అధికారులు కేంద్రం గెజిట్‌ను పరిగణనలోకి తీసుకొని 5 ఎకరాలకు మించి పొలం ఉందని ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. భూములతో సంబంధం లేకుండా మీ సేవ వెబ్‌సైట్లో సవరణలు చేయాలి. -రావుల రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం
ఇవీ చూడండి..
అమిత్‌షా జీ.. తెలంగాణకు ఏమిచ్చారో చెబుతారా?: ఎమ్మెల్సీ కవిత
ఆరోజు నటనకు గుడ్‌బై చెప్తానన్న సిద్ధార్థ్.. వరుస ప్రాజెక్ట్‌లతో విక్రమ్ జోరు