దేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఇవాళ ఓటింగ్ జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర శాసనసభలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు సహా రాష్ట్రానికి చెందిన మంది శాసనసభ్యులు అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కందుకూరు శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి కూడా ఓటింగ్ కోసం హైదరాబాద్ ఐచ్ఛికంగా ఇచ్చారు. ఆయన కూడా ఇక్కడే తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఒకటే బ్యాలెట్ బాక్సును వినియోగిస్తున్నారు. ప్రాధాన్యతా పద్ధతిన ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు మొదట, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు తర్వాత ఉన్నాయి.
ప్రాధాన్యతకు అనుగుణంగా వారి పేర్ల ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. పోలింగ్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణకుమార్ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకునిగా నియమించింది. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉపేందర్ రెడ్డి, ప్రసన్నకుమారితో కలిసి ఆయన ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ నేపథ్యంలో శాసనసభ పరిసరాలు, ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాసనసభ్యులను మినహా మిగతా ఎవరినీ భవనం లోపలికి అనుమతించడం లేదు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సును స్టోర్ రూంలో భద్రపరుస్తారు. రేపు ఉదయం బ్యాలెట్ బాక్సును దిల్లీ తీసుకువెళ్తారు. ఈఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708. రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే సింహభాగం ఓట్లు పడనున్నాయి.
తెరాసతోపాటు మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు యశ్వంత్ సిన్హాకే మద్దతు ప్రకటించాయి. భాజపాకు చెందిన ముగ్గురి మద్దతు మాత్రమే రాష్ట్రంలో ద్రౌపది ముర్ముకు ఉంది. తెరాస శాసనసభ్యులు ఉదయం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్‌లో పాల్గొని ఆ తర్వాత.. అక్కడి నుంచి బస్సుల్లో అసెంబ్లీకి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తెరాస తరపున ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉదయం 9 గంటలకు శాసనసభ చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏజెంజ్‌గా ఉండనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు భాజపా ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు.
ఇవీ చదవండి: వాడీవేడీగా అఖిలపక్ష భేటీ.. వాటిపై కాంగ్రెస్ ఫైర్.. కేంద్రం కౌంటర్!