Special Story on Etv Cameraman Omprakash : తెలుగు టెలివిజన్ చరిత్రలో ఈటీవీకి ఉన్న స్థానం ప్రత్యేకం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద కార్యక్రమాలను రూపొందిస్తూ ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఉత్తమమైన ధారావాహికలను అందిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అయితే ఈ ధారావాహికల వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల్లో ఒకరైన ఓంప్రకాశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు టెలివిజన్ ధారావాహికల్లో ఎవరూ సాహసించని పనిచేసి అందరిచేత ప్రశంసలందుకున్నారు. ఆయన పనితీరును మెచ్చిన ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ తమ రికార్డుల్లో ఓంప్రకాశ్‌కు చోటు కల్పించింది.
ETV cameraman Om Prakash got a Place Indian Book of Records : ఈటీవీలో ప్రసారమయ్యే మనసంతా నువ్వే ధారావాహికకు ఓంప్రకాశ్.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు. మలినేని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ ధారావాహిక విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో సరికొత్తగా ఎపిసోడ్స్‌ను చూపించాలని ఆలోచన చేశాడు ఓంప్రకాశ్. తన ఆలోచనకు ఛానల్ యాజమాన్యం, దర్శకుడు అంగీకారం తెలిపారు. మనసంతా నువ్వే 331వ ఎపిసోడ్‌ను సింగిల్ షాట్‌లో పూర్తి చేశారు. 21 నిమిషాలపాటు ఎక్కడా ఎలాంటి కట్స్, జర్క్ లేకుండా ఆరుగురు నటీనటుల హావభావాలు, భావోద్వేగాలను తన కెమెరాతో ఒడిసిపట్టి శభాష్ అనిపించుకున్నారు.
గతంలో పుత్తడిబొమ్మ ధారావాహికకు ఇలాగే 26 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో ఎపిసోడ్ మొత్తం చిత్రీకరించారు. అప్పుడు కూడా పేరుతోపాటు నంది అవార్డు అందుకున్నారు. అలాగే ఈసారి కూడా మనసంతా నువ్వే ధారావాహికకు చేసిన పనిని అవార్డుకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఓంప్రకాశ్ కుమారుడి సహాయంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. 4 నెలలపాటు ఓంప్రకాశ్ చేసిన సింగిల్ టేక్ షాట్‌ను పరిశీలించిన ఆ సంస్థ.. ఓంప్రకాశ్ పేరును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసింది.
నటీనటుల హావభావాలను కెమెరాతో ఒడిసిపట్టిన ఓంప్రకాష్ : మచిలీపట్నంలో పుట్టి పెరిగిన ఓంప్రకాశ్‌కు... ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. తన సోదరుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తూ కెమెరామెన్‌గా మెళకువలు సంపాదించుకున్నారు. ఆ అనుభవంతో 2000 సంవత్సరంలో ఈటీవీలో చేరిన ఓంప్రకాశ్.. మహాలక్ష్మి, భాగవతం, బాంధవ్యాలు, పంజరం, చంద్రముఖి, మనసు చూడు తరమా, పుత్తడిబొమ్మ, స్వాతిచినుకులు, మనసంతా నువ్వే ధారావాహికలకు డీవోపీగా పనిచేశారు. 28 ఏళ్ల అనుభవంలో 32 ధారావాహికలకు డీవోపీగా పనిచేసిన ఓంప్రకాశ్.. పుత్తడిబొమ్మ, స్వాతి చినికులు ధారావాహికలకు నంది అవార్డులు వరించాయి. టెలివిజన్‌లో వచ్చే ధారావాహికలకు డీవోపీగా పనిచేయడం ఎంతో సవాల్ తో కూడుకున్న విషయం అంటోన్న ఓంప్రకాశ్.. ఈటీవీ యాజమాన్యం అందించే సహకారం, ఎఫ్ ఎక్స్ 9 లాంటి అత్యాధునిక కెమెరాలు, ప్రోత్సహించే దర్శకులు, నటీనటులు ఉండటం వల్లే తాను అవార్డులు అందుకోగలుగుతున్నానని చెబుతున్నారు.
20 వేల ఎపిసోడ్స్‌తో రికార్డుకి ప్రయత్నం : తన అనుభవాన్ని అంతా పాఠాలుగా మలిచిన ఓంప్రకాశ్.. టెలివిజన్ రంగంలో 16 మంది శిష్యులను తయారుచేశారు. వారంతా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండటం విశేషం. సినిమా రంగం నుంచి అనేక అవకాశాలు వచ్చినా.. సీరియల్స్‌పై ఉన్న మక్కువతో సరికొత్త తరహాలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. 20 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు చూసుకోవాలని తపిస్తున్నారు.
ఇవీ చదవండి :