Women painters: యాదాద్రి, గజ్వేల్, నల్గొండ, మెదక్.. నుంచి 1987లో బతుకుతెరువు కోసం నగర శివారులోని కుషాయిగూడకు చేరుకున్న 30 మంది మహిళల జీవన ప్రయాణమిది. ఆలు మగలు ఇద్దరూ పని చేస్తేనే కానీ గడవదు. మగవాళ్లు రిక్షా, ఆటో నడపడమో.. చర్లపల్లి పరిశ్రమల్లో పనులో చేసేవారు. చదువు లేదు. తమలా పిల్లలూ మిగలకూడదనుకున్నారు. ఆడ వాళ్లు సిమెంటు, తాపీ పనికి వెళ్లేవారు. కానీ జీతం తక్కువ, యజమాని ప్రవర్తనతో ఇబ్బంది.. ఇలా బోలెడు సమస్యలు. అలాగని ఖాళీగా కూర్చోలేరు.
బాలయ్య అనే వ్యక్తి ఇళ్లకు సున్నాల కాంట్రాక్టులు చేసేవాడు. ఆయన దగ్గర చేరారు. చేతి నిండా పని, నెలకు కొంత డబ్బులు కనిపించేవి. వీళ్ల ఆసక్తి గమనించి, ఆయనా మెలకువలు నేర్పాడు. పనులూ అప్పజెప్పేవాడు. ఏడేళ్లు గడిచి పోయాయి. ఓ రోజు బాలయ్య హఠాత్తుగా చనిపోయాడు. మళ్లీ భవిష్యత్‌పై భయం. అప్పుడు నడిపించడానికి ముందుకొచ్చారు ఈ బృందంలోని కళమ్మ. మనమే జట్టుగా సాగుదామని ప్రోత్సహించారు. మనల్ని నమ్మేదెవరు? పనిచ్చేదెవరు.. మిగిలిన వారిలో ఎన్నో సందేహాలు. మనమే ప్రచారం చేసుకుందాం, మన పనేంటో చూపుదాం అనుకున్నారు.
చుట్టుపక్కల శుభకార్యాలు జరుగుతున్నాయంటే.. వెళ్లి అవకాశమివ్వ మనే వారు. పనులొచ్చినా అంతంత మాత్రమే! ఒకప్పటి ఆదాయం లేదు. అయినా నమ్మకం కోల్పోలేదు. అయితే ఒకసారి చేయించుకున్న వాళ్లు వేరే వాళ్లకు సిఫారసు చేస్తూ వచ్చారు. అలా మొదలైన వీరి ప్రయాణం ఇప్పటి వరకూ ఆగలేదు. వీరందరికీ ఐదు పదులు దాటినా కొనసాగిస్తున్నారు. ఈ పాతికేళ్లలో వచ్చిన మార్పులను అందుకుంటూ బహుళ అంతస్థుల నిర్మాణాలకూ రంగులేసే కాంట్రాక్టులను తీసుకుంటున్నారు.
‘ఆడవాళ్లైనా బాగా చేస్తారన్న పేరు తెచ్చుకున్నాం. ప్రభుత్వ బిల్డింగులకీ పని చేశాం. పనిని బట్టి, గ్రూపులుగా విడిపోతాం. శ్రమను బట్టి డబ్బులు విభజించుకుంటాం. పాతికేళ్లుగా కలిసి చేస్తున్నాం. ఒకే కుటుంబం మాది. చిన్న విభేదాన్నీ ఎరుగం. ఉన్నంతలో పిల్లలను చదివించుకున్నాం. చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లో చిన్నపాటి ఉద్యోగాలూ చేసుకుంటున్నాం. ఓపిక ఉన్నంత వరకూ ఇలానే సాగుతాం’ అంటారు కళమ్మ. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వశక్తితో సాగుతోన్న వీరి ప్రయాణం ఆదర్శనీయమే కదూ!
ఇవీ చదవండి: