Etela Rajender Latest Press Meet: రాష్ట్రం సాధించాలంటే రాజకీయంగానే సాధ్యమవుతుందని భావించానని.. అందుకే 2002లో తెరాసలో చేరానని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. లక్డీకాపూల్‌లోని సెంట్రల్ మాల్లో నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2005లో కరీంనగర్ జిల్లా తెరాస అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలిపారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించాను. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రులను కలియ తిరిగా. నా శక్తి సామర్థ్యాలకు మించి.. ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలు అందించాను. ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం పుట్టిందో... అదే పార్టీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మంత్రిగా ఉన్నప్పుడే ప్రగతి భవన్ లోపలికి వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. కారు గుర్తు, కేసీఆర్ బొమ్మ మీదుగా గెలిచాను కాబట్టి మంత్రిగా నా పదవికి రాజీనామా చేయాలని కరీంనగర్ జిల్లా మంత్రులు డిమాండ్ చేశారు. నా ముఖం అసెంబ్లీలో కనపడకుండా చేయాలని ఎజెండా పెట్టుకున్నారు.
భేటీకి ముందే నిర్ణయాలు
మంత్రివర్గ భేటీకి ముందే నిర్ణయాలు తీసుకునేవారు. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఎందుకని ప్రశ్నించాను. రైతుబంధు డబ్బులు కేసీఆర్ ఇంట్లోవి కావు. తెలంగాణ ప్రజల చెమట నుంచి డబ్బులు వచ్చాయి. కేసీఆర్‌కు, నాకూ రైతుబంధు ఇవ్వడం సమంజసమా? వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఎందుకని ప్రశ్నించాను. డబ్బున్న వారికి రైతుబంధు ఇస్తూ.. రైతు కూలీలు, కౌలుదారులను కేసీఆర్ విస్మరించారు. తెలంగాణ బిడ్డల రక్తం కళ్లచూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఓటర్లకు గాలం వేశారు..
హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను అనేక రకాలుగా ప్రలోభపెట్టారు. నా ఓటమి కోసం రూ.600 కోట్ల నల్లధనం ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది. కేసీఆర్ హోదాకు, ప్రజల ఆత్మగౌరవానికి ఖరీదు కట్టారు. 46వేల ఓట్లకు గాలం వేసిన కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. ప్రజల మీద ప్రేమతో ఈ పథకం తీసుకురాలేదు. ఓట్ల కేసమే తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా హుజురాబాద్‌లోనే పోటీ చేస్తాను. భాజపా ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ కూడా సిద్ధం.
పార్టీలు మారే వ్యక్తిని కాను..
కేసీఆర్, హరీశ్ రావు, మంత్రులు మాట్లాడినా సరే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ట్రబుల్ షూటర్ అని చెప్పుకొనే హరీశ్ రావు చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తెరాసలో మంత్రుల నుంచి క్రింది స్థాయి వరకు అసంతృప్తితో ఉన్నారు. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు... స్థిరమైన ఆలోచన కలిగిన వ్యక్తిని. తెరాస నుంచి నేను బయటికి రాలేదు... వాళ్లే పంపించారు. భాజపా ప్రలోభాలకు గురి చేయదు. అన్ని నిర్ణయించకున్నాకే భాజపాలో చేరాను. కేసీఆర్ తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎమ్మెల్యేలను కూడగట్టానన్న మాట అవాస్తవం. త్వరలోనే తెలంగాణలో భాజపా జెండా ఎగురబోతుంది. తెరాస దోస్తీ లేకుండా.. భాజపా సొంతంగా అధికారంలోకి వస్తుంది. భాజపా, తెరాస కలిసి పోటీ చేస్తాయనేది ఊహాజనితమైన ప్రశ్న.
-ఎమ్మెల్యే ఈటల రాజేందర్
దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ప్రజలు యావత్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఏ ఒక్క సంఘమైన ఇప్పటి వరకు సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన దాఖలాలే లేవన్నారు. హుజూరాబాద్ ప్రజలు దెబ్బ కొడితే... ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ఇందిరా పార్కు వద్ద ధర్నాకు కుర్చున్నారని ఈటల విమర్శించారు.
ఇదీ చూడండి: Etela Rajender on cm kcr: 'దేశంలోనే అసమర్థ సీఎం కేసీఆర్ అని సర్వేలో తేలింది'