Etela and Rajagopal Reddy Met Amit Shah in Delhi : రాష్ట్రంలో బీజేపీకి మరింత ఊపు తెచ్చే పనిలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిమగ్నమైంది. ఈ మేరకు రాష్ట్ర నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. శనివారం రాత్రి దిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారు తమ అభిప్రాయాల్ని విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ సునీల్ బన్సల్ పాల్గొన్నారు.
Etela and Rajagopal Reddy Delhi Tour News : ఈటల, రాజగోపాల్‌రెడ్డిల అభిప్రాయాల్ని ఓపికగా విన్న అగ్రనేతలు ఆదివారం మళ్లీ కలుద్దామని చెప్పినట్లు సమాచారం. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపడం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై సీనియర్‌ల అసంతృప్తి నేపథ్యంలో కిషన్‌రెడ్డి, ఈటల, రాజగోపాల్‌రెడ్డిలను అధిష్ఠానం దిల్లీకి పిలిపించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ ముగ్గురితో అమిత్ షా, నడ్డా గంటకు పైగా సమావేశమయ్యారు.
BJP Focus on Telangana Assembly Elections 2023 : హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు, కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ మెత్తపడిందని ప్రజలు భావిస్తున్నట్లు.. అగ్రనేతలకు ఈటల, రాజగోపాల్‌రెడ్డిలు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ ముఖ్యనేతలపై ఉన్న ఆరోపణల విషయంలో చర్యలు తీసుకుంటేనే బీజేపీపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని విస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. దిల్లీ మద్యం కేసులో చర్యలు నెమ్మదించడంతో ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీ ఉదారంగా వ్యవహరిస్తోందనే ప్రచారం పార్టీకి నష్టదాయకమని వారు ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో దూకుడు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరునూ వారు వివరించినట్లు తెలిసింది. తమకు స్వార్థం లేదని.. పార్టీలో ఎలాంటి పదవులివ్వాలి, ఎలా వినియోగించుకోవాలన్నది మీరే నిర్ణయించండని అగ్రనేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఓ వైపు తీరికలేని సమావేశాలతో ఉన్న అమిత్ షా ఈ భేటీకి సమయం కేటాయించడం చూస్తే.. తెలంగాణలో పార్టీపై తీవ్రంగానే దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు.
BJP High Command Focus on 2023 Elections : రాష్ట్రంలో పార్టీ పురోగమనానికి నిర్మొహమాటంగానే కొన్ని అంశాలపై సూచనలు చేశామని ఈటల, రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కేంద్ర నాయకత్వం రానున్న రోజుల్లో తెలంగాణపై మరింత దృష్టి పెడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతోనే తాము బీజేపీలో చేరామన్నారు. తాము సంప్రదింపుల కోసమో, స్వార్థపూరిత లావాదేవీల కోసమో దిల్లీ రాలేదని తేల్చిచెప్పారు. బీజేపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని.. ఏ సమస్య వచ్చినా సహకారం అందిస్తామంటూ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారన్నారు.
ఇవీ చదవండి: