Organ Transplant Center at Gandhi Hospital: త్వరలోనే వైద్యశాఖలో 13వేల నియామకాలను చేపట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాందీ ఆసుపత్రిని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సందర్శించారు. గాంధీలో 25కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలను ప్రారంభించారు. రూ.13కోట్లతో నూతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. రూ. 30కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మార్పులు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని ఆయన కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తున్నామని తలసాని వివరించారు.
కేవలం పెద్దలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన అవయవమార్పిడిని పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలనే ఉద్దేశంతో రూ. 30 కోట్లతో సేవలను ప్రారంభించబోతున్నాం. ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ ఉచితంగా చేసుకోవడం కోసం రూ. 30 కోట్ల కేటాయించాం. మా డాక్టర్లు కూడా చాలా పోటీతత్వంతో పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రి మరో ప్రభుత్వ ఆస్పత్రితో పోటీపడుతూ... ఇవాళ కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. త్వరలోనే వైద్యాఆరోగ్య శాఖలో 13వేల ఖాళీలను నింపేందుకు నిర్ణయం తీసుకున్నాం. కరోనా కష్టకాలంలో పనిచేసిన తాత్కాలిక సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-- హరీశ్‌రావు, మంత్రి
సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని కోరుతున్నా. గాంధీ ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తున్నాం.
-- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి