- వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. తాను కూడా పరీక్ష చేసుకునేందుకు వనస్థలిపురంలోని ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అతని నమూనాలు సేకరించిన సిబ్బంది పేరు, ఫోన్ నంబరును తప్పుగా నమోదు చేశారు. దీనిని గమనించిన యువకుడు వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే రద్దీ ఉండటంతో మార్పులు చేయకుండా అలానే వదిలేశారు. ఇంతవరకు నివేదిక ఏమైందో తెలియక అతడు ఆందోళన చెందుతున్నాడు.
- ‘మీకు కరోనా పాజిటివ్ వచ్చింది.. చికిత్స కోసం ఆసుపత్రికి రండి’ అంటూ మహేశ్వరానికి చెందిన ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్ వచ్చింది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని... అసలు తాను నమూనాలే ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఓ నర్సు నుంచి నమూనాలు తీసిన సిబ్బంది ఫోన్ నంబరు తప్పుగా నమోదు చేసుకోవడంతో ఆమెకు బదులు అంగన్‌వాడీ కార్యకర్తకు సమాచారం వెళ్లినట్లు అధికారులు ఆ తర్వాత గుర్తించారు.
ఆందోళన చెందుతూ..
తాము శాంపిళ్లు ఇవ్వకుండానే కరోనా ఉందని ఫోన్ చేసి చెబుతున్నారని వివిధ ప్రాంతాలకు చెందినవారు వాపోతున్నారు. దీనివల్ల నిజమైన బాధితులకు సమాచారం అందడంలో జాప్యం జరుగుతోంది. రోజులు గడిచినా తమకు నివేదిక రాక.. కరోనా ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తున్నా నిరాశే ఎదురవుతోంది. శాంపిళ్ల సేకరణ వరకే తమ పని అని...పాజిటివ్ లేదా నెగెటివ్ వివరాలను స్థానిక వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తెలుసుకోవాలని తిప్పి పంపుతున్నారు. జనం రద్దీ వల్ల కొన్ని కేంద్రాల్లో జవాబు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చిరునామా, పేర్లు, చరవాణి నంబరు నమోదులో పకడ్బందీ విధానం అవసరమన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.