మన ఇంట్లో మోటార్ సైకిల్‌కు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాం. పాడైతే వెంటనే మెకానిక్‌ను సంప్రదిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా వైద్య పరికరానికి స్వల్ప సమస్య ఎదురైతే మాత్రం పక్కన పడేస్తున్నారు. నెలల తరబడి పట్టించుకోవడంలేదు. వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు, ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాలు.. ఒక్కటేమిటి ప్రజల ప్రాణాలు నిలిపే పరికరాలెన్నో మూలపడి ఉన్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కలిపి.. సుమారు రూ. 700 కోట్ల విలువైన వైద్య పరికరాలుంటాయని అంచనా. వాటిలో కొవిడ్ కాలంలో కొన్నవే సుమారు రూ. 250 కోట్ల విలువైనవి ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ సహా 100కు పైగా పరికరాలు వృథాగా పడి ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియాలోనూ 10 ఈసీజీ మిషన్లు సహా ఆపరేషన్ థియేటర్‌లోని కొన్ని హైడ్రాలిక్ టేబుల్స్ పాడయ్యాయి. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో శాశ్వత ప్రాతిపదికన ఒక్కరే బయో మెడికల్ ఇంజినీరు ఉండడంతో.. వైద్య పరికరాల పర్యవేక్షణే కరవైంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పరికరాల్లో సుమారు 30-40 శాతం వరకూ నిరుపయోగంగా పడి ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.
నిరుపయోగానికి కారణాలు?
* ఉత్పత్తి సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరింపజేసుకోవడంలో వైఫల్యం.
* సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడం.
* నిర్ధారణ పరీక్షలకు అవసరమైన రీఏజెంట్లను సరఫరా చేయకపోవడం.
* కొన్ని జిల్లాల్లో నమూనాలు తీసుకుని, కొత్తగా నెలకొల్పిన తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రానికి పంపిస్తున్నారు. దీంతో సాధారణ పరీక్షలు నిర్వహించే పరికరాలను పక్కనపడేశారు.
* కొందరు సిబ్బంది ప్రైవేటు ల్యాబ్‌లతో కుమ్మక్కై.. పరికరాలను పాడుచేస్తుండటం.
నిర్వహణ బాధ్యత ఎవరిది?
ఏదైనా సంస్థ వద్ద వైద్య పరికరాన్ని కొంటే ఆ సంస్థ ఐదేళ్ల కాల వ్యవధికి మరమ్మతుల బాధ్యత తీసుకుంటుంది. ముందే ఆ ఒప్పందం ఉంటుంది. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వార్షిక నిర్వహణ ఒప్పందం, రెండోది సమగ్ర నిర్వహణ ఒప్పందం. రెండోదానికి పరికరం ధరలో 5-7 శాతం వరకూ ఖర్చువుతాయి. సీఎంసీకి పరికరం ధరలో సుమారు 10-15 శాతం ఖర్చు ఉంటుంది. రాష్ట్రంలో పరికరాల నిర్వహణకు సుమారు రూ. 25 కోట్లు అవుతుందని వైద్యవర్గాల అంచనా. ఆ నిధులు కేటాయించడం లేదు. గతంలో ఈ వ్యవహారమంతా ఆసుపత్రులే చూసుకునేవి. దీనివల్ల సమస్యలు తలెత్తడంతో రెండేళ్ల కిందట ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ సంస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదనే కారణంతో.. ఒప్పందం రద్దు చేసుకున్నారు. దీంతో మళ్లీ ఆసుపత్రి సూపరింటెండెంట్లపైనే పరికరాల నిర్వహణ భారం పడింది. వారి పనులు వారికి ఉండడంతో వీటిపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
తమిళనాడు విధానం భేష్
తమిళనాడులో ప్రత్యేకంగా అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరికరాల బాగోగుల్ని చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ తేడా వచ్చినా వెంటనే సవరిస్తుంటుంది. ఇక్కడ కూడా అలాగే ప్రభుత్వమే ఆ బాధ్యత స్వీకరించాలని కొందరు వైద్యులు అంటున్నారు. 500 పడకలున్న ఆసుపత్రికి ఒకరు చొప్పున.. కనీసం 25 మంది బయోమెడికల్ ఇంజినీర్లు అవసరమవుతారని వైద్యశాఖ మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలను ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయని పరికరాల వివరాలు
సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ పనిచేయడం లేదు. రోగులను ఉస్మానియాకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లలేని వారు ప్రైవేటులో స్కానింగ్ చేయించుకుంటున్నారు.
వరంగల్ ఎంజీఎంలో కేంద్రీయ ఏసీ సౌకర్యం లేకపోవడంతో మొరాయిస్తున్న ఎంఆర్‌ఐ
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలో 11 ఎక్స్‌రే యంత్రాలుండగా.. వాటిలో 9 పనిచేయడం లేదు.
జనగామ: ఆపరేషన్ థియేటర్లో మైక్రోస్కోపులు రెండు పనిచేయడంలేదు. ఇక్కడ సీటీస్కాన్ మూలపడి మూడేళ్లు దాటింది.
మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదిన్నరగా రూ. 1.20 కోట్ల విలువైన డిజిటల్ ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు.
అచ్చంపేట: సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఏడాదిగా ఎక్స్‌రే యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. మూడేళ్ల కిందట ప్రారంభించిన ఈ-హెల్త్ కేంద్రం సేవలు నిలిచిపోవడంతో.. ఇందులోని పరికరాలు నిరుపయోగమయ్యాయి.
గోదావరిఖని: ఆసుపత్రిలో 2 సీఆర్మ్ పరికరాలకు గాను ఒక్కటే పనిచేస్తోంది. శవాగారంలో ఉన్న 2 ఫ్రీజర్లూ పాడవడంతో.. మృతదేహాలను భద్రపరచడం కష్టంగా ఉంది.
కోరుట్ల: సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్ధారణ పరీక్షలు చేసే సెల్ కౌంట్ పరికరం పనిచేయడం లేదు. ఇంక్యుబేటరుకు గది లేక పక్కనపడేశారు. సాంకేతిక నిపుణులు లేకపోవడంతో కొత్తగా కొన్న ఎక్స్‌రే మిషన్‌కు కవరు కూడా తొలగించలేదు.
పెద్దపల్లి: ఈసీజీ యంత్రం ఉన్నప్పటికీ టెక్నీషియన్ లేక నిరుపయోగంగా ఉంది.
మెట్‌పల్లి: ఇక్కడ సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఐదు నెలలుగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం నిరుపయోగంగా ఉంది. ఇదే సమస్యతో డిజిటల్ ఎక్స్‌రే పరికరం కవరు కూడా తీయలేదు.
ఇల్లెందులో మూలనపడిన ఎక్స్‌రే పరికరం
ఇల్లందు: ఇక్కడి సాంకేతిక నిపుణుడిని మరోచోటికి బదిలీ చేయడంతో.. ఎక్స్‌రే మిషన్ రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం: టేకులగూడెం మండల పరిధిలోని సూలనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫొటోథెరపీ మిషన్ పనిచేయడం లేదు.
సంగారెడ్డి: జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో రెండేళ్లుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పనిచేయడం లేదు. ఇక్కడ దంత సమస్యలకు చికిత్స అందించే పరికరాలు కూడా నిరుపయోగంగా ఉన్నాయి.
జహీరాబాద్‌లో అట్టపెట్టెల్లోనే వెంటిలేటర్లు
జహీరాబాద్: కొత్తగా 4 వెంటిలేటర్లు వచ్చినా ఇప్పటి వరకూ బిగించలేదు. వృథాగా పడిఉన్నాయి.
ఆదిలాబాద్ రిమ్స్‌లో పనిచేయని వార్మర్లు
ఆదిలాబాద్: రిమ్స్‌లో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని 20 వార్మర్లలో 9 చెడిపోగా.. నిర్ధారణ పరీక్షలు చేసే సెల్‌కౌంటర్, గుండెజబ్బు నిర్ధారణకు వినియోగించే ‘టీఎంటీ’ పరికరం, ఎలక్ట్రోలైట్స్, ఏబీజీ పరికరాలు కూడా మూలనపడ్డాయి.
కరీంనగర్: పదేళ్ల కిందట రూ.10 లక్షలు పెట్టి కొన్న డెంటల్ ఎక్సేరేకు చిన్నపాటి రిపేర్ రావడంతో.. దాన్ని వినియోగించకుండా పక్కన పెట్టారు. కొన్ని నెలల క్రితం పాడైన మొబైల్ ఎక్సేరే, వెంటిలేటర్, సెల్‌కౌంటర్ యంత్రాలను సైతం సకాలంలో బాగు చేయించకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
మహబూబాబాద్: మల్యాల పీహెచ్‌సీకి నాలుగేళ్ల కిందట అందించిన రూ.5 లక్షల విలువ చేసే ఎక్స్‌రే పరికరం అట్టపెట్టెలోనే ఉంది. రూ.9 లక్షల విలువ చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాన్ని వినియోగించడం తెలియక పక్కన పెట్టడంతో దుమ్ముపడుతోంది. ఇక్కడ మైక్రోస్కోప్, శస్త్రచిక్సితకు అవసరమైన బెడ్, లైట్లు, ఆక్సిజన్ సిలిండర్లు సైతం వినియోగంలో లేవు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలను వినియోగించడం లేదు. కురవి పీహెచ్‌సీలో ఎక్స్‌రే పరికరాన్ని వినియోగించకుండా ప్రత్యేక గదిలో పెట్టి తాళం వేశారు.
హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన మొగిలి(56) నడుంనొప్పితో బాధపడుతూ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుణ్ని ఓపీలో సంప్రదించాడు. ఎంఆర్‌ఐ స్కాన్ అవసరమని సూచించారు. ఎంజీఎంలో ఎంఆర్‌ఐ పనిచేయడంలేదు. సెంట్రల్ ఏసీ సౌకర్యం లేకపోవడంతో అది వేడెక్కి మొరాయిస్తోంది. రోజుకు 30-40 స్కానింగ్‌లు చేయాల్సిన చోట.. 7-8 మాత్రమే చేస్తున్నారు. గత్యంతరం లేక మొగిలి ప్రైవేటు ల్యాబ్‌లో రూ.7 వేలు ఖర్చు పెట్టి స్కాన్ చేయించుకోవాల్సి వచ్చింది.
వీటి రోగం కుదిర్చేదెవరు!
* సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రూ. 4 కోట్ల విలువైన అధునాతన క్యాథ్‌ల్యాబ్ రెండేళ్లుగా నిరుపయోగంగా పడి ఉంది. రోగులను బయటకు వెళ్లమంటున్నారు.
* ఉస్మానియాలో ఇటీవలే రూ. 7 కోట్లతో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను నెలకొల్పినా.. ఇంకా ప్రారంభం కాలేదు. ఫలితంగా గుండెజబ్బు రోగులు ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది.
* ప్రైవేటులో యాంజియోగ్రామ్‌కు రూ.15-20 వేలు ఖర్చవుతోంది. స్టెంట్ వేయాల్సి వస్తే యాంజియోప్లాస్టీకి రూ. 1.75 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది.
* ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత విలువైన యంత్రపరికరాలు పనిచేయకపోవడంతో రోగుల జేబులకు చిల్లుపడుతోంది.