రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ.. ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
కాముని దహనం:
సతీవియోగంతో ఉన్న శివునికి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీ దేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివునికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మథుడిని పరమేశ్వరుడి మీదకు పంపిస్తారు. అప్పుడు మన్మథుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. అనంతరం మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు.. అతడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు.
పతి వియోగంతో బాధపడుతున్న మన్మథుని సతి రతీదేవి శివుడిని వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మంటల్లో హోళిక..
రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ వరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. అయితే అతని కుమారుడు ప్రహ్మాదుడు కూడా విష్ణు భక్తుడే. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫలయత్నాలు చేస్తాడు. అప్పుడు తన సోదరి హోళికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోళిక మంటలను రగిల్చి ఆ మంటల్లో ప్రహ్లాదుడిని తోసేస్తుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోళికను దహించివేస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం రూపంలో మంటలు వేస్తారు.
రాధపై కృష్ణయ్య రంగుల వర్షం..
మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తన కంటే అందంగా ఉందని.. తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద.. రాధ శరీరం నిండా రంగులు పూయమని కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటినుంచి అది ఒక వేడుకగా మారిపోయింది.
ఇదీ చదవండి: హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!