ఇంజినీరింగ్ విద్యా సంవత్సరాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మరోసారి సవరించింది. సెప్టెంబర్ 15 లోగా యూనివర్సిటీలు, కళాశాలల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని సవరించిన క్యాలెండర్లో పేర్కొంది. అక్టోబరు 20 లోగా మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి.. తొలి విడత సీట్లు భర్తీ చేయాలని సూచించింది. నవంబర్ 1 నాటికి రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేసి.. మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. మిగిలిన సీట్లను నవంబరు 15 లోగా భర్తీ చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.
పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా నవంబరు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ఈ నెల 25 లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీటీఈ తెలిపింది. దూర విద్య కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఈ నెల 30.. రెండో విడత వచ్చే జనవరి 28లోగా ముగించాలని పేర్కొంది. తరగతులు ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా రెండు కలిపి నిర్వహించుకోవచ్చునని స్వేచ్ఛనిచ్చింది.
గతంలో ప్రకటించిన విద్యా సంవత్సరానికి అనుగుణంగా ఇప్పటికే ఆన్లైన్ తరగతులు మొదలు పెట్టిన కాలేజీలు.. వాటిని వాయిదా వేసుకోవచ్చునని లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులకు కొనసాగించవచ్చునని సూచించింది. పరీక్షల విషయంలో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి.. విద్యాసంవత్సరంలో మార్పులు ఉండొచ్చునని తెలిపింది.