Shri krishna company: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసగించిన శ్రీకృష్ణ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం జప్తు చేసింది. బ్యాంకులను రూ.528.26 కోట్ల మేర మోసగించిన కేసు దర్యాప్తు క్రమంలో సంస్థకు చెందిన రూ.37.38 కోట్ల ఆస్తులను గుర్తించి స్వాధీన పరుచుకుంది. తోట కన్నారావు అనే వ్యాపారి శ్రీకృష్ణ స్టాకిస్ట్స్ అండ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌కేఎస్‌టీపీఎల్), శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌కేఏఐపీఎల్) సంస్థల్ని స్థాపించాడు. గోదాముల నిర్మాణం పేరిట 2014-15లో ఐఎఫ్‌సీఐ, ఐడీబీఐ, కెనరా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. ఆ సమయంలో తప్పుడు వివరాలను సమర్పించాడు.
ఆయన మోసాలకు ప్రభుత్వ సంస్థలు అపిట్కో, మిట్కాన్‌తో పాటు ఐఎఫ్‌సీఐ బ్యాంకు డీజీఎం వి.సి.రామ్మోహన్ సహకరించారు. అలా బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా రుణ ఖాతాలు నిరర్ధక ఆస్తుల జాబితాలోకి వెళ్లిపోయాయి. అనంతరం మోసపోయినట్లు గుర్తించిన బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే మూడు కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు చేపట్టింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సంస్థ నిర్వాహకులు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే బుధవారం రూ.37.38 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.