టాలీవుడ్ మత్తుమందుల కేసు మూలాలు తవ్వి తీసేందుకు నడుం బిగించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇందుకోసం అవసరమైతే ఇంటర్‌పోల్ మద్దతు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. మత్తుమందుల కొనుగోళ్లకు సంబంధించి జరిగిన చెల్లింపులపై విచారణ జరుపుతున్న ఈడీ ఏ దేశానికి ఎంతమొత్తంలో నిధులు మళ్లించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరిని విచారించిన తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి అవసరమైతే మరికొందర్ని ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం అంటే 2017లో వెలుగు చూసిన టాలీవుడ్ మత్తుమందుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాపు బృందం జరిపిన దర్యాప్తులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఇదే విషయాన్ని వారు దాఖలు చేసిన అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మత్తుమందులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దాంతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. మత్తుమందుల దిగుమతికి సంబంధించిన చెల్లింపుల మూలాలు తెలుసుకోవడమే లక్ష్యంగా విచారణ మొదలుపెట్టింది.
అమెరికాతోపాటు ఆస్ట్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కొరియర్ ద్వారా మత్తుమందులు దిగుమతి అయినట్లు ఆబ్కారీ దర్యాప్తులో బయటపడింది. చెల్లింపులన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరిగాయి. ఇదంతా అక్రమ వ్యాపారమే. ఆయా దేశాల్లోని మత్తుమందుల వ్యాపారుల ఖాతాల్లోకి ఇక్కడ నుంచి నగదు బదిలీ జరిగింది. ఇప్పుడు మత్తుమందుల కొనుగోలు కోసం డబ్బు లావాదేవీలు జరిగాయని నిరూపించాలంటే ఇక్కడ ఎవరి ఖాతా నుంచి చెల్లించారో తెలుసుకోవచ్చు. కాని అక్కడ ఎవరి ఖాతాలో జమ అయ్యాయో తెలియాలంటే ఆయా దేశాల సహకారం తప్పనిసరి. ఫలానా దేశంలోని ఫలానా ఖాతాలో డబ్బు జమ అయిందని నిర్ధారించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు అడిగితే అక్కడి బ్యాంకులు సహకరించవు. అందుకే అవసరమైతే ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
మత్తుమందుల కొనుగోళ్లకు జరిగిన చెల్లింపులకు సంబంధించి సిట్ దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయి. వీటిని అభియోగపత్రంలో పేర్కొన్నారు. వీటి ఆధారంగా విదేశాల్లోని లావాదేవీల వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. సినీ ప్రముఖుల విచారణ పూర్తయిన తర్వాత మత్తుమందుల నిధుల చెల్లింపు దర్యాప్తు ఊపందుకోనుంది.
ఇదీ చూడండి: CM KCR: 'నా చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తా'